జంపింగ్స్ గురూ… మూడు పార్టీలకూ కోవర్టుల టెన్షన్ షురూ!

ఏపీలో రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ప్రతీ రోజూ ఒక సెన్సేషన్ అన్నట్లుగా వ్యవహారం సాగుతుంది. ఇందులో భాగంగా ఎవరు ఏ పార్టీలో ఉంటారు.. మరెవరు ఏ పార్టీ కండువా కప్పుకుంటారు అనేది ఆసక్తిగా మారుతుంది. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజే అనూహ్య పరిణామాలు జరిగాయి. ఇందులో భాగంగా కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ రాజీనామా చేశారు.

ఇదే సమయంలో వైసీపీలో జాయిన్ అయ్యి, వారంరోజుల్లోనే రాజీనామా చేసిన క్రికెటర్ అంబటి రాయుడు… జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యారు. అనంతరం కొన్ని గంటల్లోనే తూచ్.. గోయింగ్ టు దుబాయ్ ఫర్ క్రికెట్ అని ట్వీట్ చేశారు. ఆ రెండు సంఘటనలూ ఒకెత్తు అనుకుంటే… టీడీపీ సీనియర్ నేత కేశినేని నానీ.. జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి పలు సంచలన విషయాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా చంద్రబాబు మోసగాడని తెలుసు కానీ ఇంతపచ్చి మోసగాడనుకోలేదు అంటూ నానీ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. ఇక “ఆఫ్ట్రాల్ లోకేష్” అంటూ చినబాబు పూచిక పుల్ల కింద తీసిపడేశారు. ఇక మరికొంతమంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పకుండానే “క్యారెక్టర్ లెస్ ఫెలో” అని సంభోదించారు. వెంటనే బుద్ధా వెంకన్న, దేవినేని ఉమా రియాక్ట్ అయ్యారు.

ఆ సంగతి అలా ఉంటే… వరుసగా వైసీపీ, టీడీపీ తోపాటు జనసేనలోకి కూడా చేరుతున్న ఈ జంపింగ్ లను ఎంతవరకూ నమ్మొచ్చు.. వీరు నిజంగా పార్టీలపైన అభిమానంతోనే వస్తున్నారా.. లేక, కోవర్టుల పాత్ర పోషిస్తున్నారా అనే సందేహాలతో కూడిన చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మొదలైంది. ప్రధానంగా వైసీపీ నుంచి టీడీపీ, జనసేనల్లో చేరుతున్న పలువురి నేతల విషయంలో ఈ సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

వాస్తవానికి వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జై టీడీపీ అన్నప్పుడే ఈ సందేహం రాజకీయ వర్గాల్లో వినిపించింది. అయితే ఆ అనుమానం బలపడకుండా ఆయన మెయింటైన్ చేయగలిగారు!! ఆ సంగతి అలా ఉంటే… ఇటీవల జగన్ టిక్కెట్ ఇవ్వడం లేదనే కారణాన్ని చూపెడుతూ, మరో నాలుగేళ్లు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ వంశీకృష్ణయాదవ్ జనసేనలో చేరిపోయారు.

ఆ సమయంలో కూడా పలు సందేహాలు చర్చకు వచ్చాయి. ఇప్పటికిప్పుడు వంశీకృష్ణయ్యాదవ్ కి వైసీపీని కాదని జనసేనలో చేరాల్సిన అవసరం ఏమిటనే చర్చ నడిచింది. ఇదే క్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి తెలుగుదేశంలో చేరడం దాదాఫు ఖరారైందని అంటున్నారు. హార్డ్ కోర్ వైఎస్ ఫ్యామిలీ ఫ్యాన్ అన్నట్లు కనిపించే పార్ధసారధి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా పలు సందేహాలకు తావిస్తుంది.

అవన్నీ ఒకెత్తు అయితే… తాజాగా టీడీపీ కీలక నేత, విజయవాడం ఎంపీ కేశినేని నానీ వంటి నేత సైతం ఫ్యాన్ కిందకు చేరిపోబోతున్నారు. అయితే… చంద్రబాబుతో తీవ్రంగా చెడిపోవడం అందుకు ప్రధాన కారణం అని తెలుస్తున్న వేళ.. ఈ జంపింగ్ ఒక్కటే కాస్త సందేహాలకు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది తప్ప… మిగతా పైన చెప్పుకున్న జంపింగ్ ల విషయంలో మాత్రం కోవర్టులనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి!

కాగా… ఎన్నికల సీజన్ వస్తే అత్యంత సహజంగా జరిగే ఈ జంపింగులు, వారిని కోవర్టులుగా వేసే అంచనాలు అత్యంత సహజం అనేది తెలిసిన విషయమే. పైగా… రాజకీయాల్లో శాస్వత శత్రువులు, శాస్వత మిత్రులు ఉండరు కదా!!