తనపై ఉన్న కేసుల విషయంలో జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చెలరేగుతున్నాయి. విశాఖ ఎయిర్పోర్టులో కోడి కత్తి దాడి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ పలు సార్లు కోర్టు విచారణకు హాజరవుతుండగా, జగన్ మాత్రం ఏ ఒక్క విచారణకూ హాజరుకాలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మార్చి 21కు విచారణ వాయిదా పడగా, జగన్ ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నట్లు విమర్శకులు అంటున్నారు. తన వాంగ్మూలం ఇస్తే కేసు త్వరగా తేలిపోతుందని, కానీ ఎందుకనో జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే చర్చ కొనసాగుతోంది.
ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో జైలులో ఉన్న సమయంలో జగన్ నేరుగా విజయవాడ జైలుకు వెళ్లి పరామర్శించడం, ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వంశీపై అన్యాయంగా కేసులు పెట్టారని జగన్ ఆరోపించడం, అదే సమయంలో తనపై ఉన్న కేసుల్లో కోర్టుకు హాజరు కాకపోవడం వైసీపీ ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దీనికితోడు దళిత సంఘాల నుంచి కూడా జగన్పై విమర్శలు పెరుగుతున్నాయి. దళిత యువకుడు ముదునూరి సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయ్యినప్పుడు పరామర్శకు వెళ్లే జగన్, అదే సామాజిక వర్గానికి చెందిన కోడి కత్తి దాడి కేసు నిందితుడు శ్రీనివాస్ కోర్టు విచారణలో క్రమం తప్పకుండా హాజరైనా, ఆయన కేసు సత్వర పరిష్కారం కోసం ఎటువంటి చొరవ చూపకపోవడం ఆగ్రహానికి దారితీసింది. దళిత నాయకుడు బూసి వెంకట్రావు కూడా జగన్ తీరుపై విమర్శలు గుప్పించారు.
అదే సమయంలో జగన్ ఆదాయానికి మించి ఆస్తుల కేసులోనూ కోర్టు విచారణలకు తరచుగా గైర్హాజరు అవుతున్నట్టు కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం జైలుకు వెళ్లి తన పార్టీ నేతలను పరామర్శించే జగన్, తనపై ఉన్న కేసుల విషయాన్ని పట్టించుకోవడం లేదనే భావన బలపడుతోంది. జగన్ నిజంగా నిర్దోషి అని నిరూపించుకోవాలంటే కోర్టులో హాజరై, తన వాంగ్మూలం ఇవ్వడమే సరైన మార్గమని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.