చెక్ బౌన్స్ కేసులో పాయకరావుపేట తెలుగు దేశం ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కోర్టు సమన్లు జారీ చేసింది.
ఒక బాధితుడు వేసిన సివిల్ కేసుకు సంబంధించి విశాఖ పట్టణం 12వ అదనపు జిల్లా జడ్జి (ఓఎస్ నంబరు 434/2018)నుంచి ఆమెకు సమన్లు అందాయి. ఈ విషయంలోనే క్రిమినల్ కేసు (సీసీ నంబరు 1919/2018)కి సంబంధించి ఈ నెల 26వ తేదీన వాయిదాకు హాజరు కావల్సి ఉంది. ఈ విషయాలను బాధితుడు వేగి శ్రీనివాస రావు అనే దివ్యాంగ కాంట్రాక్టర్ స్వయంగా విలేకరులు సమావేశం ఏర్పాటుచేసి వెల్లడించారు.
శ్రీనివాసరావు చెప్పిన వివరాలు:
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన వేగి శ్రీనివాసరావు సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు. పాయకరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆయనకు బాగా పరిచయం. ఈ పరిచయం ఉపయోగించి 2015 అక్టోబర్ నెలలో అతని వద్ద రూ.70 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అందుకు సంబంధించి ప్రామిసరీ నోటు, పోస్ట్ డేటెడ్ చెక్కును అనిత ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. రోజులు గడిచే కొద్ది బ్యాంక్ లో డిపాజిట్ చేయవద్దని శ్రీనివాస రావు మీద ఎమ్మెల్యే అనిత వత్తిడి తీసుకువస్తూ వచ్చారు.
ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు లోన్ కు దరఖాస్తు చేసుకున్నానని, లో న్ డబ్బులు రాగానే బాకీ తీర్చేస్తానని నమ్మబలుకుతూ వచ్చారు. అయితే, ఈ లోపు శ్రీనివాసరావుకుఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. తన అప్పు తీర్చాలని శ్రీనివాసరావు కోరుతూ వస్తున్నారు. గతేడాది జూలై 30న రూ.70 లక్షల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు చెక్కు (నంబరు 994220)ను అనిత ఆయనకు ఇచ్చారు. ఆ చెక్కును బ్యాంకులో వేశారు. అయితే, ఎమ్మెల్యే అకౌంట్లో బ్యాలెన్స్ లేదని బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావుకు లేఖ పంపారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు.
ఇంతకీ ఈ డబ్బు ఎందుకిచ్చినట్లు…
2014 ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని, కొందరికి బాకీ పడ్డానని, వాటిని తీర్చకపోతే, ఎమ్మెల్యేగా పరువు పోతుందని అనిత బతిమాలుకున్నారు. ఆమెపై నమ్మకంతో శ్రీనివాసర రావు ఆ డబ్బు సమకూర్చారు. వ్యాపారం కోసం తను దఫదఫాలుగా సమకూర్చుకున్న రూ.70 లక్షల మొత్తాన్ని ఆమెకు ఒక్కసారిగానే అందజేశానని కూడా ఆయన చెప్పారు. ఇంత వరకు ఆమె అప్పు తీర్చకపోగా చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేశారనిచెబుతూ విధిలేకే కోర్టును ఆశ్రయించానని అన్నారు. అకౌంట్ లో డబ్బు లేదని తెలిసి కూడా ఆమె డబ్బు ఇచ్చారని ఆయన చెప్పారు.