ఏబీఎన్ ఆర్కే లేదా ఆంధ్రజ్యోతి ఆర్కే లేదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా సుపరిచితం. చంద్రబాబు నమ్మిన బంటు. టీడీపీ అంటే అన్నీ కోసుకుంటాడు. చంద్రబాబు నాయుడు కోసం ఏదైనా చేస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు కుడి భుజం అనుకోండి.
ఇక.. చంద్రబాబు మీద ఉన్న ప్రేమతో ఎవ్వరినైనా తిట్టేస్తాడు. తన కొత్త పలుకు ఉన్నది కదా. ఆ కొత్త పలుకు పేరుతో ఉన్నవి లేనివి అన్నీ పలుకుతాడు. తన బాస్ (బాబు) కోసం ఎన్నో తిప్పలు పడుతుంటాడు. ఈ సమయంలోనే బీజేపీ నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఆయన ప్రతి ఆదివారం కొత్త పలుకు అంటూ వ్యాసాలు రాస్తుంటాడు కదా. గత ఆదివారం ప్రచురితమైన కొత్త పలుకు వివాదాస్పదమైంది. ఆర్కే… బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై ఎక్కు పెట్టాడు. జీవీఎల్ పార్టీకి తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాడంటూ తనకు తోచింది రాసిపడేశాడు.
కొత్త పలుకుపై వెంటనే సోము వీర్రాజు స్పందించారు. ఇదివరకు మోదీపై, బీజేపీ పై తప్పుడు కథనాలు వండి వార్చిన నీకు ఇప్పుడు ఒక్కసారిగా బీజేపీపై అంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి. ఏపీలో మేము ఎదగడం లేదని మీరు అంతలా బాధ పడుతున్నట్టున్నారు. ఇంకా మీరు చంద్రబాబును రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఆపకపోతే కష్టం. ఒక పత్రికను అడ్డం పెట్టుకొని పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం నీ లేకితనానికి నిదర్శనం.. అంటూ ఓపెన్ లెటర్ రాశారు వీర్రాజు.
వీర్రాజు కౌంటర్ ఇచ్చిన తర్వాత వెంటనే జీవీఎల్ కూడా మీడియాతో మాట్లాడుతూ… ఆర్కేపై ఉక్కుపాదం మోపారు. కేంద్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో.. టీడీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. త్వరలో బీజేపీ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి రాబోతోంది. అది కొందరికి నచ్చక ఇలాంటి పిచ్చి కథనాలను వండి వార్చుతున్నారు. కడుపు మంట వాళ్లకు. టీడీపీని గాఢంగా అభిమానించే పత్రిక అధినేత ఉన్నారు కదా. మరి.. కాంగ్రెస్, టీడీపీలను కలిపి మీ రాహుల్ మీ ఇష్టం.. మీ లోకేశ్ మీ ఇష్టం.. అని అంటారో లేదో చూద్దాం.. అంటూ పరోక్షంగా ఆర్కేపై విమర్శనాస్త్రాలు సంధించారు జీవీఎల్.
వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత కొన్ని రోజుల వరకు ఎల్లో మీడియా జోలికి పోలేదు. కానీ.. ఏపీ ప్రజల్లో బీజేపీ పార్టీపై వ్యతిరేకత వచ్చేలా ఎల్లో మీడియా కథనాలను వండి వార్చుతుండటంతో ఇక రంగంలోకి దిగి ఎల్లో మీడియా పని పడుతున్నారు. ఎల్లో మీడియా డ్రామాలకు చెక్ పెట్టేందుకు ఏపీ బీజేపీ సమాయత్తమైనట్టే ఇక. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఏబీఎన్ ఆర్కేకు ఇవన్నీ మింగుడుపడక.. కావాలని ఏపీ బీజేపీని టార్గెట్ చేసుకొని కొత్త పలుకు పేరుతో ఈ పలుకులన్నీ పలుకుతున్నట్టుగా తెలుస్తోంది.