చంద్రబాబుకో దండం..పొత్తు వద్దే వద్దు

తెలుగుదేశంపార్టీతో పొత్తులు వద్దే వద్దంటున్నారు ఏపి కాంగ్రెస్ పార్టీ నేతలు. మొన్ననే తెలంగాణా ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం తర్వాత చంద్రబాబుతో పొత్తంటేనే కాంగ్రెస్ నేతలు ఉలిక్కిపడుతున్నారు. నిజానికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవటం రెండు రాష్ట్రాల్లోను కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే విషయాన్ని చంద్రబాబు ఢిల్లీ స్ధాయిలో పావులు కదిపారు. కాంగ్రెస్ కు సంబంధం లేని జాతీయ పార్టీ సీనియర్ నేత ఒకరు రాహూల్, చంద్రబాబుకు మధ్య వర్తిత్వం వహించటంతో రాహూల్ కూడా చంద్రబాబుతో పొత్తులకు ఒప్పుకున్నారట.

 

సరే రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరిన తర్వాత జరిగిన విషయాలన్నీ అందరూ చూసిందే. తెలంగాణా ఎన్నకల్లో రెండు పార్టీలకు తల బొప్పి కట్టింది. దాంతో టి కాంగ్రెస్ నేతలు చంద్రబాబంటేనే మండిపడుతున్నారు. చంద్రబాబుతో కలవకపోయుంటే కాంగ్రెస్ కు మంచి ఫలితాలు వచ్చుండేదన్నది కాంగ్రెస్ నేతల వాదనగా ఉంది. సరే టి కాంగ్రెస్ నేతల వైఖరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లైంది. తెలంగాణాలో అనుభవాన్ని చూసిన తర్వాత ఏపిలో కాంగ్రెస్ నేతలు మేలుకున్నారు.

 

వచ్చే ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు వద్దని మెజారిటీ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై రాహూల్ తో చర్చించేందుకు ఈనెల 25వ తేదీన ప్రత్యేకంగా ఢిల్లీకి వెళుతున్నారు ఏపి నేతలు. చంద్రబాబుతో పొత్తులు పెట్టుకోవటం వల్ల కాంగ్రెస్ కు ఎటువంటి లాభం లేదని స్పష్టం చేయనున్నారు. లాభం లేకపోగా నష్టాలు తప్పవని కూడా గట్టిగా చెప్పేందుకు రెడీ అవుతున్నారు. నాలుగున్నరేళ్ళ చంద్రబాబు అవినీతి పాలన గురించి వివరించేందుకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా రెడీ చేసుకున్నారట.

 

తెలంగాణాలో పొత్తుల పేరుతో కాంగ్రెస్ ను చంద్రబాబు డిమినేట్ చేసిన విషయమే ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని నేతల మధ్య చర్చ జరుగుతోంది. చంద్రబాబు గ్రాఫ్ నాలుగున్నరేళ్ళలో బాగా పడిపోయిందన్నది కాంగ్రెస్ నేతల వాదన. చంద్రబాబు పరిస్దితే గనుక బాగుండుంటే అసలు కాంగ్రెస్ గురించి ఏమాత్రం ఆలోచించే వారు కాదన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. మంచో చెడో ఒంటిరిగానే పోటీ చేద్దామని ఇపుడు కాకపోయినా తర్వాత ఎన్నికల్లో అయినా ప్రజలు కాంగ్రెస్ ను ఆదరిస్తారనే ఆశాభావంతో కాంగ్రెస్ నేతలున్నారు. తెలంగాణాలో మొన్నటి  అనుభవంతో రేపటి పార్లమెటు ఎన్నికల్లో చంద్రబాబుతో కలవటానికి టి కాంగ్రెస్ నేతలెవరూ ఇష్టపడటం లేదు. మరి రాహూల్ ఏం చేస్తారో చూడాలి.