కాంగ్రెస్ పార్టీలోని తీరు పై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీలోని కొందరు నాయకుల తీరు పై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో గ్రూపు రాజకీయాల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. ఇప్పటికైనా నేతలు మారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పనిచేయాలన్నారు. జగ్గారెడ్డి ఏమన్నారంటే…

కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలకు పుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. తాను జైలులో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న హేహా హేమీలు కనీసం చూడడానికి కూడా రాలేదు. ఆ సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు అండగా నిలిచారు. వీహెచ్ తప్ప మరెవరు కూడా నన్ను పరామర్శించడానికి రాలేదు. ఈ విషయంలో చాలా హర్ట్ అయ్యాను.

కాంగ్రెస్ పార్టీలో లాబీయిస్టులదే రాజ్యం నడుస్తోంది. ఇప్పుడు పలు పదవులు వచ్చిన వారికి లాబీయింగ్ వల్లనే వచ్చాయి. ఇప్పటికైనా లాబీయింగ్ లకు అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ కష్టపడితే ఈజీగా 8 పార్లమెంటు సీట్లు గెలుచుకుంటుంది. గ్రూపు రాజకీయాలు పక్కన పెట్టి అంతా కలిసి పని చేయాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది.

సీఎం కేసీఆర్ తో తనకు ఎటువంటి వైరం లేదు. రాజకీయంగానే తప్ప వ్యక్తిగతంగా ఎవరితో కూడా నాకు లొల్లి లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది అప్పులలో బతుకుతున్నారు. వారందరిని ఆదుకోవాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ పై ఉంది. సీనియర్ నాయకులు ఎంపీలుగా బరిలో ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అని జగ్గారెడ్డి అన్నారు.