పంచాయతీ ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ పార్టీ తొలి విజయం సాధించింది. తొలి విడత జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామ సర్పంచ్ ముక్కోణపు పోటీలో కాంగ్రెస్ (ఐ) అభ్యర్థి గొంది సురేష్ విజయం సాధించారు. దీంతో స్థానిక కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణా సంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని సురేష్ చెప్పారు.
వరుస పరాజయాలతో కొట్టు మిట్టాడుతున్న కాంగ్రెస్‌కు పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిన్న జరిగిన తొలి విడత ఎన్నికల్లో ఓ స్థానం దక్కింది. గెలిచింది ఒక స్థానంలోనే అయినా, ఆ పార్టీ నేతల్లో మాత్రం బోల్డంత ఉత్సాహాన్ని నింపింది. దాదాపు కనుమరుగైన పార్టీ అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందడంతో కాంగ్రెస్‌పై ప్రజల్లో ఇంకా అభిమానం ఉందని చెప్పడానికి ఇది ఉదాహరణ అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు పంచాయతీకి నిన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గొంది సురేశ్ విజయం సాధించారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన ముక్కోణపు పోటీలో చివరికి కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధించాడు. 2014, 2019 సాధారణ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు. ఆ తర్వాత తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి తెలవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.