టీడీపీలో ముదురు నాయకుల మధ్య ముదిరిన వివాదం… యనమల ఏం చేస్తారో ?

Conflicts in peddapuram Telugudesam party leaders

నా అడ్డాలో నీ పెత్తనం ఏంటని ఒకరినొకరు మాటలతో కత్తులు దూస్తున్నారు. ఒకప్పుడు కలిసి మెలిసి తిరిగిన నాయకులే.. ఇప్పుడు స్వపక్షంలో వైరిపక్షంగా మారిపోయారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో సీనియర్‌ నాయకులకు కొదవ లేదు. ఓడినా నెగ్గినా ఇక్కడి నాయకులంతా కలిసే ఉంటారనేది ఒకప్పటి టాక్‌. ఇప్పుడు టీడీపీ నేతలే ఒకరినొకరు ఓపెన్‌గానే విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పెద్దాపురం కేంద్రంగా సాగుతున్న విమర్శలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ రూరల్‌ టీడీపీ ఇంఛార్జ్‌ పిల్లి సత్తిబాబు, మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామరావు మధ్య వార్‌ నడుస్తోంది.

Conflicts in peddapuram Telugudesam party leaders
Conflicts in peddapuram Telugu desam party leaders

ప్రస్తుతం పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, పిల్లి సత్తబాబు మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకప్పుడు ఇద్దరు నాయకులు చాలా సన్నిహితంగా మెలిగిన వారే. గతంలో పెద్దాపురం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు బొడ్డు భాస్కర రామారావు. సత్తిబాబుకు బొడ్డు రాజకీయ గురువు కూడా. ఇప్పుడు గురుశిష్యులు ఒక్కటై చినరాజప్పను టార్గెట్‌ చేశారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతల ఆధిపత్య పోరు సైతం ఆ ప్రచారాన్ని బలపరుస్తోంది. చినరాజప్ప వైఖరికి నిరసనగా పార్టీ పదవులకు రాజీనామా చేస్తానంటున్నారు సత్తిబాబు.

గతంలో పిల్లి సత్తిబాబు మూడో కుమారుడిపై వివాహేతర సంబంధం కేసు నమోదైంది. బాధిత మహిళతో సత్తిబాబు కుటుంబం రాజీ చేసుకోవడానికి అప్పట్లో హోంమంత్రిగా ఉన్న చినరాజప్ప సహకరించారట. అయితే జనరల్‌ ఎన్నికల నాటికి ఈ వివాదం రాజకీయరంగు పులుముకుంది. వైసీపీ నేతల ఎంట్రీతో పరిస్థితి మారిపోయిందట. ఆ మధ్య పిల్లి సత్తిబాబు కుమారుడి పెళ్లకి చినరాజప్ప, యనమల రామకృష్ణుడు వెళ్లగా.. బాధిత మహిళ ఎంట్రీతో సీన్‌ రివర్స్‌ అయింది. పెళ్లికి వెళ్లిన చినరాజప్ప, యనమలపై సైతం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇంత జరిగినా.. ఇప్పుడు బొడ్డు భాస్కరరామారావుతో కలిసి సత్తిబాబు తనకు వ్యతిరేకంగా మారారని చినరాజప్ప గుర్రుగా ఉన్నారట. 2019 ఎన్నికల్లోనే చినరాజప్పను ఓడించడానికి కుట్రచేశారని ఆరోపిస్తూ పాత సంగతులను తవ్వి తీస్తున్నారు.

పెద్దాపురం కేంద్రంగా భాస్కర రామారావు తిరిగి యాక్టివ్‌ అయ్యే వ్యూహంలో భాగంగానే సత్తిబాబు విమర్శలు చేస్తున్నారని చినరాజప్ప శిబిరం అనుమానిస్తోంది. మాజీ హోంమంత్రి మాత్రం గతాన్ని తలుచుకుని పిల్లి కుటుంబానికి అంత మేలు చేస్తే.. ఇప్పుడిలా కుట్రలు చేస్తారా అని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. పెద్దాపురం టీడీపీ ప్రస్తుతం రెండు శిబిరాలుగా విడిపోయింది. పెత్తనం నీదా నాదా అన్న గొడవ కారణంగా నేతల మధ్య దూరం పెరిగింది. ఈ విషయం అమరావతి వరకు వెళ్లడంతో సమస్య చేయిదాటిపోకుండా రెండు వర్గాలను కలిపే బాధ్యతలను యనమలకు అప్పగించిందట టీడీపీ అధిష్ఠానం. ఈ వ్యవహారాన్ని యనమల ఎలా సరిచేస్తారో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.