కన్ ఫాం… పవన్ పక్కా పొలిటీషియన్!

జనసేన అధినేత ప్రొఫెషనల్ పొలిటీషియన్ కాదని, ప్రజాసేవ సంగతి పక్కనపెడితే.. ఆయనకు రాజకీయలంటే ఏమిటో తెలియదని.. ప్రత్యర్థులు నిత్యం విమర్శిస్తుంటారు. అయితే… పవన్ కు రాజకీయాలు వచ్చాని, నిన్నమొన్నటి వరకూ పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉన్నప్పటికీ… ప్రస్తుతానికి జనాల్లో ఉన్న ఆయనకు పక్కా పొలిటీషియన్ లక్షణాలు వచ్చేశాయని అంటున్నారు పరిశీలకులు.

వారాహి విజయ యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ బస్టాండ్‌ కూడలిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు జనసేన అధినేత. ఈ సందర్భంగా మైకందుకున్న ఆయన… తాను రాజకీయాల్లోకి వచ్చిన పద్నాలుగేళ్లైందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఫలితంగా… “పద్నాలుగేళ్ల వనవాసం పూర్తయ్యింది.. ఇక కురుక్షేత్ర యుద్ధం చేద్దాం.. జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం” అని పవన్‌ పిలుపునిచ్చారు.

దీంతో జనసైనికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఎక్కడ లేని ఆనందం వారి కరతాల ధ్వనుల రూపంలో వినిపించింది. ఇదే కదా తామంతా కోరుకుంటున్నది అనే విషయాన్ని అరుపులతో వారంతా చెప్పకనే చెప్పారు. ఇంతకాలం.. చంద్రబాబు పల్లకి తాను మోస్తాను.. జనసైనికులంతా వెనక జయహో జయహో అంటూ తిరగండి.. అన్న చందంగా మాట్లాడుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్న తరుణంలో.. పవన్ ఇలా వ్యాఖ్యానించిచారు.

పవన్ తాజాగా… “జనసేన ప్రభుత్వం” అనే మాటలు మాట్లాడారు. అందుకోసం 175 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాల్సి రావొచ్చు.. పైగా త్రిముఖ పోటీ వస్తే 90 సీట్లు సాధించాల్సి ఉంటుంది. మరి పవన్ ఇందుకు సిద్ధంగా ఉన్నారా? జనసేనకు అంత బలం ఉందా? ఆ సంగతి తర్వాత… కానీ నిన్నమొన్నటి వరకూ జగన్ సర్కార్ ని గద్దె దింపాలి అని మాత్రమే నినాదాలు చేసిన ఆయన… తాజాగా జనసేన ప్రభుత్వం – పవనే సీఎం అనే స్థాయిలో చేస్తున్న కామెంట్లు… పవన్ కు రాజకీయాలు బాగా తెలుసు అనే విశ్లేషణలకు బలం చేకూరుస్తున్నాయి.

ఇంతకాలం చంద్రబాబు మద్దతుతో మనుగడ సాధించిన పవన్… ఇలా ఈరోజు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఒకపక్క టీడీపీ కేడర్ చేస్తున్న కామెంట్ల సంగతి కాసేపు పక్కనపెడితే… పవన్ కచ్చితంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లే!

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. పవన్ మొన్న చెప్పిన మాట నిన్న చెప్పరు.. నిన్న ఇచ్చిన స్టేట్ మెంట్లు రేపు ఇవ్వరు.. అనే విమర్శ ఉన్న నేపథ్యంలో.. గోదావరి జిల్లా దాటిన అనంతరం వ్యూహంలో ఏదైనా మార్పు వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి!