చూడు పిన్నమ్మా.. టిడిపి ఎంపి శివ ప్రసాద్ కు షాక్

చిత్తూరు టిడిపి ఎంపి, సినీ నటుడు శివ ప్రసాద్ పార్లమెంటులో తన హడావిడి ఇంకా తగ్గించలేదు. పైపెచ్చు శివ ప్రసాద్ లీలలు తారా స్థాయికి చేరాయి. ఎంతగా అంటే ఆయన తాజాగా పార్లమెంటులో పరకాయ ప్రవేశం చేసేవరకు వెళ్లిపోయారు. ప్రత్యేక హోదా కోసం ఆయన రోజుకొక గెటప్ తో అలరిస్తున్నారు. ఆయన వేషాల కోసం పార్లమెంటు సభ్యులే ఎదురుచూసే పరిస్థితి నెలకొందన్న చర్చ ఉంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశాన్ని దేశం మొత్తానికి తెలియజేసేందుకు ఈ గెటప్స్ వేస్తున్నారు శివప్రసాద్. ఈ గెటప్స్ లో తాజాగా మోడీ బావా.. చూడు పిన్నమ్మా అంటూ హిజ్రా గెటప్ వేశారు. ఆ వేషం పై మిశ్రమ స్పందన వస్తోంది. హిజ్రా వేశాన్ని ఏకంగా మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ మెచ్చుకున్నారు. కానీ లోకల్ గా మాత్రం శివ ప్రసాద్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయనకు నంద్యాలలో షాక్ తగిలింది. అది కూడా హిజ్రాల నుంచే షాక్ తగలడం చర్చనీయాంశమైంది.

 తాజాగా శివ ప్రసాద్ హిజ్రా వేశంలో పార్లమెంటుకు హాజరు కావడం వివాదాస్పదమవుతున్నది. చూడు పిన్నమా గెటప్ లో ఆయన హావభావాలన్నీ హిజ్రా మాదిరిగానే ఉన్నాయి. శివ ప్రసాద్ అసలే సినీ యాక్టర్ కూడా కావడంతో హిజ్రా పాత్రలో జీవించారు. ఈ సందర్భంగా మోడి బావా చూడు పిన్నమ్మా.. ప్రత్యేక హోదా ఇవ్వమంటానూ.. అంటూ సాంగ్ కూడా పాడారు. ఈ గెటప్ తో ఎంపి శివప్రసాద్ ఎంత  క్రేజ్ తెచ్చుకున్నారో అంత వివాదాన్ని కూడా మూటగట్టుకున్నారు. 

శివప్రసాద్ వేసిన గెటప్ పై రాయలసీమలో హిజ్రాలు భగ్గుమన్నారు. నంద్యాల లో హిజ్రాలు శివ ప్రసాద్ గెటప్ కు వ్యతిరేకంగా పోలీసు కేసు పెట్టారు. శివ ప్రసాద్ హిజ్రాలను అవమానించేలా వ్యవహరించారని మండిపడ్డారు.  సమాజంలో ఇప్పటికే తమ పట్ల చిన్న చూపు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఎంపిగా ఉన్న శివ ప్రసాద్ మా వేశం వేసుకుని మమ్మల్ని కించపరిచేలా వ్యవహరించారు. మమ్మల్ని అవమానించిన ఆయన తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలి అని వారు డిమాండ్ చేశారు. నిత్యం సమాజంలో వివక్షత ఎదుర్కొంటున్న తమకు రాజకీయ నేతగా ఉన్న శివ ప్రసాద్ అండగా ఉండాల్సిందిపోయి తమను హేళన చేసేలా వేషాలు వేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు.

హిజ్రాలకు అవమానించేలా వెకిలి చేష్టలతో ప్రదర్శనలు చేసిన శివ ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. శివ ప్రసాద్ చేసిన ఫిర్యాదుపై నంద్యాల రూరల్ పోలీసులు స్పందించారు. పార్లమెంటులో మోదీ బావా.. చూడు పిన్నమ్మా గెటప్ వేసి హిజ్రాలను అవమానపరిచారని వారు చేసిన ఫిర్యాదు అందినట్లు రూరల్ పోలీసులు చెప్పారు. వారి ఫిర్యాదుపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని నంద్యాల  రూరల్ పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ గెటప్ విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు పైనా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పస్తున్నాయి. ఇలాంటి గెటప్ వేసి తెలుగు వారి గౌరవ మర్యాదలను ఢిల్లీలో పోగొడుతున్నారంటూ నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఎంపి శివ ప్రసాద్ మోదీ బావా.. చూడు పిన్నమ్మా గెటప్ వీడియో పైన ఉంది చూడండి.