కమ్యూనిష్టు యోధురాలు, స్వతంత్ర ఉద్యమకారిణి కొండపల్లి కోటేశ్వరమ్మ 102 బుధవారం ఉదయం కన్నుమూశారు. కోటేశ్వరమ్మ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోటేశ్వరమ్మ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్దం కృష్ణా కాలేజి వద్ద మనువరాలు ఇంటి వద్ద ఉంచనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు అంతిమ యాత్ర నిర్వహించిన అనంతరం కోటేశ్వరమ్మ భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులు కేజీహెచ్ కు అప్పగించనున్నారు. కోటేశ్వరమ్మ తన భౌతిక కాయాన్ని మెడికల్ కళాశాలకు అప్పగించాలని కోరడంతో కుటుంబ సభ్యులు ఆమె ఇష్టం ప్రకారమే బాడీని మెడికల్ కాలేజికి అప్పగిస్తున్నారు.
కోటేశ్వరమ్మ కొండపల్లి సీతారామయ్య గారి భార్య. వీరిద్దరికి పీపుల్స్ వార్ లో పని చేసినప్పుడు పరిచయం ఏర్పడింది. అలా పెళ్లికి దారితీసింది. వీరికి కుమార్తె కరణ, కుమారుడు జన్మించారు. కుమారుడు కూడా నక్సల్స్ ఉద్యమంలో మరణించాడు. కొంత కాలానికి సీతారామయ్య, కోటేశ్వరమ్మ విడిపోయారు. కోటేశ్వరమ్మ ప్రముఖ రచయితగా పేరు సాధించారు.
మరోవైపు కోటేశ్వరమ్మ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. అలాగే కోటేశ్వరమ్మ మృతి పట్ల ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.