అరకు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావును హత్య చేసిన మావోయిస్టుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆదివారం ఉదయం సుమారు 11.30 గంటల ప్రాంతంలో ఎంఎల్ఏ కిడారితో పాటు మాజీ ఎంఎల్ఏ సిబేరి సోమను కూడా మావోయిస్టులు తుపాకులతో కాల్చి చంపేసిన విషయం అందరికీ తెలిసిందే. ఏజెన్సీ ఏరియాలైన పాడేరు, అరకు ప్రాంతాల్లోని సుమారు 13 మండలాల్లో పెద్ద స్ధాయిలోని ప్రజాప్రతినిధులపై మావోయిస్టులు దాడి చేసింది లేదు. ఎప్పుడో 2004లో మాజీ మంత్రి మణికుమారి భర్తను కాల్చి చంపిన ఘటన తర్వాత ఏకంగా ఎంఎల్ఏ, మాజీ ఎంఎల్ఏపై మావోయిస్టులు చంపటం ఇదే ప్రధమం.
ఎవరూ ఊహించని రీతిలో మావోయిస్టులు ఇంతటి ఘాతుకానికి తెగబడటంతో ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు నివ్వెరపోయారనే చెప్పాలి. మామూలుగా అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగే మావోయిస్టులకు-ఆ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులకు ఏదో ఓ రూపంలో సంబంధాలుంటాయన్నది బహిరంగ రహస్యమే. కాకపోతే ఎంఎల్ఏనే హత్య చేసేంత సాహసానికి దిగుతారని ఎవ్వరూ ఊహించలేదు. ఎప్పుడైతే ఎంఎల్ఏ, మాజీ ఎంఎల్ఏలపై మావోయిస్టుల దాడి విషయం తెలిసిందే పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
ఆదివారం సాయంత్రానికి అరకు, పాడేరు నియోజకవర్గాల్లోని అన్నీ మండలాల్లో గ్రేహౌండ్స్ బలగాలను రంగంలోకి దింపారు. మావోయిస్టుల ఏరివేతలో బాగా అనుభవమున్న సుమారు 500 మంది ప్రత్యేక దళాలు అటవీ ప్రాంతాన్ని ఆదివారం సాయంత్రం నుండి జల్లెడ పడుతున్నాయి. పై మండలాల్లోని సుమారు 100 కిలోమీటర్ల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతాల్లో పోలీసులు గాలింపులు మొదలుపెట్టారు. అంటే మావోయిస్టులు దొరుకుతారని కాదుకానీ అదో ఆనవాయితీ. నిజానికి ఎంఎల్ఏ, మాజీ ఎంఎల్ఏలను చంపేసిన తర్వాత మావోయిస్టులు ఆంధ్ర ఒడిస్సా బార్డర్ (ఏవోబి) గుండా ఒడిస్సా రాష్ట్రంలోని అడవుల్లోకి వెళ్ళిపోయారు. ఆ విషయం భద్రతా దళాలకు కూడా తెలుసు. అయినా కానీ అడవుల్లో గాలింపు చర్యలెందుకుంటే, స్ధానికులకు ఆత్మస్ధైర్యం కోసం.
ఇక, ఈరోజు ఎంఎల్ఏ స్వస్ధలమైన పాడేరులోనే అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోస్టుమార్టమ్ నిర్వహించి కిడారి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు ఇవ్వగానే స్వస్ధలానికి తీసుకెళ్ళిపోతారు. మధ్యాహ్నం జరిగే అంత్యక్రియలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని సమాచారం. వారికోసం విశాఖపట్నంలో రెండు హెలికాప్టర్లను ప్రభుత్వం సిద్ధం చేసింది . అయితే పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు, పోలీసులు ఉన్నతాధికారులు హాజరయ్యే సమయంలో మావోయిస్టులు మళ్ళీ ఎటువంటి దాడులకు పాల్పడకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ఎంఎల్ఏ స్వగ్రామం చుట్టు పక్కల భారీగా మోహరించారు.