కలెక్షన్ ఫుల్.. సానుభూతి నిల్: అమరావతి ఉద్యమంపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు.!

Perni Nani

అమరావతి రైతులు వసూళ్ళకు పాల్పడుతున్నారా.? రాజకీయ నాయకులు వసూళ్ళకు పాల్పడుతుంటారా.? అధికార పార్టీ నాయకుల అవినీతి గురించి ఎప్పటికప్పుడు మీడియాలో వార్తా కథనాల్ని చూస్తూనే వున్నాం. సరే, ‘మాది గొప్ప ప్రభుత్వం.. అవినీతికి తావు లేకుండా పాలిస్తున్నాం..’ అని వైసీపీ చెప్పొచ్చుగాక. అవినీతి లేకుండా ప్రభుత్వాలు నడవడం అనేది జరిగే పనేనా.?

రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు, గడచిన మూడేళ్ళుగా ఉద్యమాలు చేయడమంటే చిన్న విషయం కాదు. దానికి బోల్డంత ఖర్చవుతుంది. కానీ, మొండిగా ముందడుగు వేశారు.. దూకుడుగా ఉద్యమాలు చేస్తున్నారు. బహిరంగ సభలూ అప్పుడప్పడూ నడుస్తున్నాయ్. కేసులు, కోర్టులకు అయ్యే ఖర్చులు.. ఇదంతా పెద్ద కథ.

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు.. అంటూ ఆ మధ్య అమరావతి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేశారు అమరావతి రైతులు. మళ్ళీ ఇంకో యాత్ర అలాంటిది చేయబోతున్నారు. ఈ యాత్ర మీద మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. ‘అమరావతి రైతులది కలెక్షన్ ఫుల్.. సానుభూతి నిల్ వ్యవహారం..’ అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.

గతంలో మంత్రిగా పని చేసిన పేర్ని నాని అలా అనొచ్చా.? రైతులంటే, వాళ్ళూ ఓటర్లే. ప్రభుత్వం వాళ్ళ సంక్షేమం గురించి కూడా ఆలోచించాలి. మూడు రాజధానులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చుగాక. అందులో ఒక రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చింది ఈ రైతులే. ఆ రైతులే లేకపోతే, అమరావతికి భూములు దొరికేవా.? ఇప్పుడు సీఆర్డీయే చట్టంలో మార్పులు చేసి, పేదలకు ఇస్తామంటున్న భూములు కూడా అమరావతి రైతులవే కదా.!

ఇలాంటి విషయాల్లోనే ప్రభుత్వం ఒకింత మానవత్వం అనే కోణంలో ఆలోచన చేయాల్సి వుంటుంది. సెటైర్లేసి అధినేత దగ్గర నాయకులు మెప్పు పొందాలనుకుంటే, తద్వారా పార్టీని నాశనం చేస్తున్నట్లేనని ఆయా నాయకులూ తెలుసుకోవాల్సి వుంటుంది.