గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్ ఛార్జిలు హాజరయ్యారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై కూడా ఈ సమావేశంలో సీఎం జగన్, పార్టీ శ్రేణులతో చర్చించారు. అదేవిధంగా.. “జగనన్నే మా భవిష్యత్తు”.. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. క్యాంపెయిన్ పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జగన్ ఏమి చెప్పారనేది ఇప్పుడు చూద్దాం!
ఏవేవో సంచలనాలకు ఏప్రిల్ 3వ తేదీ వేదికకాబోతుందని.. ఆ రోజు వైకాపాలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయని.. ఎమ్మెల్యేల పనితీరుపై జడ్జిమెంట్ లు పాస్ చేసి, వారి భవిష్యత్తుపై జగన్ ఒక క్లారిటీ ఇస్తారని.. రకరకాల ఉహాగాణాలు గత నాలుగైదు రోజులుగా మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే… వాటన్నింటికీ భిన్నంగా నేడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైకాపా నాయకులు సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమలో… “ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటినీ టచ్ చేసి, ప్రతి ఇంటికీ మొబైల్ స్టిక్కర్ ఇచ్చి, మన ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలి” అని జగన్.. ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ సమయంలో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా ఏంటో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని.. ఇంతకాలం చేతల్లో చేసిందీ చూపించాలని తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే ప్రజలకు అర్థమయ్యేలా కరపత్రాలు ముద్రించి మరీ వివరించాలని జగన్ సూచించారు.
అదేవిధంగా… దాదాపుగా ఇప్పటికే సగం సచివాలయాల్లో గడపగడప కార్యక్రమాన్ని పూర్తి చేశామన్న జగన్.. మిగతా సగం వచ్చే 5 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఆగస్ట్ నాటికి గడప గడప కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రతీఒక్కారూ పనిచేయాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఇక సెప్టెంబరు నుంచి వేరే కార్యక్రమాలకు శ్రీకారం చుడదామని తెలిపిన ఆయన… సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకోవాలని, సోషల్ మీడియా ప్రచారాన్ని పెంచాలని సూచించారు. అంటే.. ఫైనల్ గా… “గేర్ మార్చాలి – స్పీడ్ పెంచాలి – సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఉధృతం చేయాలి” అని క్లారిటీ ఇచ్చారు జగన్!