సమ్మిట్ రిజల్ట్: స్వామికార్యం స్వకార్యం సక్సెస్!!

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ – 2023 హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఊహించని రీతిలో ఈ సమిట్ సక్సెస్ అయ్యిందని – అనుకున్నదానికంటే ఐదారురెట్లు ఎక్కువగా పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుంటే… ఆ కార్యక్రమంలో ఏమి లోపాలుజరిగాయో వెతికే పనిలో ప్రతిపక్షం ఉంది!

ఆ సంగతులు అలా ఉంటే… అన్నీ సెట్ చేసుకు, సరిగ్గా ఇప్పుడే జగన్ ఈ కార్యక్రమం ఎందుకు పెట్టారనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ప్రశ్నగా ఉంది. ఏముంది ఇంకో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి కదా అందుకే అనేది ప్రతిపక్షాల సమాధానం! కానీ… జగన్ లక్ష్యం అది మాత్రమే కాదని – మరొకటి ఉందని చెబుతున్నారు విశ్లేషకులు!

వచ్చే ఎన్నికల్లో గెలుస్తున్నామని ఇప్పటికే ధీమాగా చెబుతున్నారు జగన్. దానికింకా బోలేడు సమయం ఉంది కాబట్టి ఆ సంగతి కాసేపు పక్కనపెడితే… అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను పొందడం ఎంత ముఖ్యమో… వారందరినోటా “విశాఖ అద్భుతమైన నగరం” అని చెప్పించడం కూడా అంతే ముఖ్యమని జగన్ భావించారట! ఇది అసలు ఉద్దేశ్యం అని అంటున్నారు విశ్లేషకులు!

అందులో భాగంగానే… ఈ సమ్మిట్ కి వచ్చిన మెజారిటీ పెట్టుబడిదారులతో, మరి ముఖ్యంగా భారతదేశానికి చెందిన బడా వ్యాపారవేత్తలతో, తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన బిజినెస్ మ్యాన్స్ తోనూ చెప్పించే ప్రయత్నం చేశారు జగన్! అవును… ముఖేష్ అంబానీ, అదానీ, జీఎంఆర్ అధినేత మొదలుపెడితే.. రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి దానికి కొనసాగింపుగా విశాఖను ఆకాశానికెత్తేశారు.

ఇదే క్రమంలో… పీవీ సింధూ సైతం తన అకాడమీని విశాఖలొ స్థాపించబోతున్నట్లు ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా… పోర్ట్స్ అండ్ షిప్పింగ్ శాఖ కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ సైతం పొగడ్తలతో ముంచెత్తారు. విశాఖ ఒక అద్భుతమైన నగరమని, శతాబ్ధాలుగా భారతదేశంలో విశాఖ కీలకంగా ఉందని.. విశాఖ పోర్టు అభివృద్ధికి శక్తివంచన లేకుండా సహకారం అందిస్తామని చెప్పారు. దీంతో… జగన్ కు కావాల్సింది ఇదే అని. ఈ సమ్మిత్ ద్వారా స్వామి కార్యం – స్వకార్యం రెండూ జగన్ పూర్తి చేసుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే… మార్చి 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో జగన్ మూడు రాజధానుల బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. దీనికి ప్రజలనుంచి కూడా మోరల్ సపోర్ట్ తోపాటు.. అటు కేంద్రం నుంచి కూడా మద్దతు రావడంతోపాటు.. అంబానీ – అదానీ – జీఎంఆర్ లతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బడా బడా వ్యాపారవేత్తలు సైతం విశాఖను కొనియాడటం ఇప్పుడు జగన్ కి చాలా ముఖ్యం.

దీంతో… ఈ సమిట్ వల్ల ఊహించినదానికంటే ఐదారు రెట్లు ఎక్కువగా పెట్టుబడులు రావడం ఒకెత్తు అయితే… వచ్చిన ప్రతీ వ్యాపారవేత్తా.. విశాఖ గురించి అద్భుతంగా చెప్పడం బోనస్ అని.. జగన్ ఆశించింది కూడా ఇదేనని అంటున్నారు విశ్లేషకులు!