అంటరానితనంపై జగన్ సంచలన వ్యాఖ్యలు… తెరపైకి పిశాచాలు!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం జగన్‌… అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా అంటరానితనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలది అంటరానితనం వంటి రాజకీయమంటూ దుయ్యబట్టారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను అమలు చేశామని అన్నారు.

అవును… పేద‌ల‌కు ఇళ్లు ఇవ్వకుండా అడ్డు కుంటున్నారంటూ.. ప్రతిప‌క్షాల‌పై విరుచుకుప‌డ్డారు జగన్. ఇలా చేయ‌డం కూడా అంట‌రానిత‌న‌మేన‌ని కొత్త నిర్వచ‌నం చెప్పారు. పేదలు చదివే స్కూళ్లను పాడుబడేలా చేయడం, వాటిని ఆధునికీక‌రిస్తుంటే.. వాటిని కూడా అడ్డుకోవ‌డం అంటరానితనమేన‌ని సీఎం చెప్పారు.

ఇదే సమయంలో పేద కుటుంబాల‌కు చెందిన చిన్నారులు ఇంగ్లీష్‌ మీడియం చదువుకోవద్దని, ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీషు మీడియాన్ని వ‌ద్దని చెప్పడం.. దానిపై కోర్టులకు కూడా వెళ్లడం వంటివి అంటరానితనమే అవుతుంద‌ని సీఎం జ‌గ‌న్ తేల్చి చెప్పారు. పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయడం కూడా అంటరానితన మేన‌ని అన్నారు.

ఈ సందర్భంగా… పేదల సహనాన్ని పరీక్షించడం కూడా అంటరాని తనమే అని.. పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధమేనని సీఎం స్పష్టం చేశారు. అనంతరం… వైద్యశాఖలో ఏకంగా 53, 126 పోస్టుల భర్తీ చేసినట్లు వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికలు కాలేజీలు నిర్మిస్తున్నామని, 108, 104 సేవల కోసం కొత్తగా 1514 వాహనాల కొనుగోలు చేసినట్లు చెప్పారు.

ఇదే సమయంలో.. రాష్ట్రంలో 50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామని చెప్పిన జగన్… గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్‌ లు, డిజిటల్‌ లైబ్రరీలు తెచ్చామని.. పౌర సేవల్ని ఇంటింటికి తీసుకెళ్లగలిగామని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చామని జగన్ అన్నారు.

ఇదే క్రమంలో… విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని తెలిపిన వైఎస్‌ జగన్‌… నాడు – నేడుతో 45 వేల ప్రభుత్వ బడుల రూపురేఖలు మారగా.. గవర్నమెంట్‌ స్కూళ్లలో ఇంగీష్‌ మీడియం అమలు చేస్తున్నట్లు తెలిపారు. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచర్‌ విధానం.. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌ లు అందజేస్తున్నామని అన్నారు. దీనికిగాను పిశాచాల‌తోనే పోరాటం చేయాల్సి వ‌చ్చింద‌ని జగన్‌ వ్యాఖ్యానించారు.

#@AkBigNews CM YS Jagan : అంటరానితనం అంటే అట్టడుగు వర్గాలను దూరం పెట్టడమే కాదు..