సంక్షేమం విషయంలో, ప్రజల కష్ట సుఖాల గురించి ఆలోచించే విషయంలో జగన్ మరో అడుగు వేయబోతున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఒకే కుటుంబంలో రెండో పింఛను అర్హతపై ప్రభుత్వం సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే జగన్ సర్కార్ మరికొంతమంది కుటుంబాలకు చాలా గొప్ప సాయం చేసినవారవుతారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవును… రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన “జగనన్న సురక్ష” పేరుతో వాలంటీర్లను ఇంటింటికీ పంపి ఈ వివరాలపై సర్కార్ ఆరా తీయిస్తోందని తెలుస్తుంది. “జగనన్న సురక్ష” సర్వేకి సంబంధించి వాలంటీర్లకు ప్రత్యేక యాప్ ఇవ్వగా.. ఇంట్లో రెండో వ్యక్తి ఏ పింఛనుకు అర్హులు? అనే ప్రశ్నను కూడా ఆ ప్రశ్నల లిస్ట్ లో పొందుపరిచారు. దీంతో జగన్ సర్కార్… రెండో పింఛన్ ఆలోచనలో ఉందని తెలుస్తుంది!
ఇప్పటికే ఒక పింఛన్ తీసుకుంటున్న కుటుంబాల్లో రెండో పింఛనుగా వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగుల పింఛన్, కల్లుగీత కార్మికుల పింఛన్, మత్స్యకార పింఛన్, చేనేత పింఛన్, డప్పు కళాకారులు, చర్మకారులు, హిజ్రాల పింఛన్ కు ఎవరైనా అర్హులు ఉన్నారా.. అనే వివరాలను నమోదు చేసుకుంటున్నారని తెలుస్తుంది. దీంతో త్వరలో రెండో పింఛన్ పైనా జగన్ సర్కార్ ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ తెరపైకి వచ్చింది.
కాగా, గతంలో ప్రభుత్వం ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛను విధానాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో… వృద్ధులైనా, వితంతువులైనా, ఒంటరి మహిళలైనా ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు ఉంటే ఒకటి నిలిపేశారు.