ఒకపక్క సంక్షేమ పథకాలు పక్కాగా అమలు, మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ఇంకోపక్క గత ప్రభుత్వాల హయాంలో మూతబడిన సంస్థల పునరుద్దరణ… ఈ గ్యాప్ లో చంద్రబాబు- పవన్ కల్యాణ్ లపై సీరియస్ పంచులు, ర్యాగింగ్ సెటైర్లు… ఇలా సాగిపోతుంది ఏపీలో జగన్ పరిపాలన! ఈ సమయంలో మరోసారి పవన్ పైనా, చంద్రబాబుపైనా జగన్ వెటకారమాడుతూ కామెంట్స్ చేశారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు నేడు భూమి పూజ చేశారు. ఈ భూమి పూజ అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ని టార్గెట్ చేశారు. చంద్రబాబు హయాంలో అతిపెద్ద చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైందని జగన్ మండిపడ్డారు. అన్యాయంగా చిత్తూరు డెయిరీని మూసివేశారని ఫైరయ్యారు. ఈ సందర్భంగా హెరిటేజ్ ప్రస్థావనను జగన్ తెరపైకి తీసుకొచ్చారు.
చంద్రబాబు హయాంలో పాడిరైతులకు ఆశ్రయంగా ఉన్న చిత్తూరు డెయిరీ నష్టాలలో ఉంటే, హెరిటేజ్ డెయిరీ మాత్రం లాభాలోకి వెళ్లడం ఆశ్చర్యమేసిందని జగన్ ఎద్దేవా చేశారు. ఈసందర్భంగా పాదయాత్రలో భాగంగా తాను చిత్తురు ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నట్లు జగన్ తెలిపారు. అనంతరం బాబు హయాంలోని 182 కోట్లు బకాయిలను తీర్చి చిత్తూరు డెయిరీ ని పునః ప్రారంభిస్తున్నామని జగన్ స్పష్టం చేశారు!
అనంతరం చంద్రబాబు, పవన్ లను ఉమ్మడిగా టార్గెట్ చేసిన పవన్… తీవ్రస్థాయిలో ఫైరవుతూ.. మధ్య మధ్యలో చెణుకులు విసిరారు. చంద్రగిరిలో గెలవలేమని కుప్పం వలస వెళ్లిన వ్యక్తి చంద్రబాబు అంటూ బాబుని ఎద్దేవాచేసిన జగన్… ఆయన సంగతి తాజాగా గ్రహించిన కుప్పం ప్రజలు.. “బై బై బాబు” అంటున్నారని పేర్కొన్నారు.
ఇంతకాలం ప్రజలను చేయాల్సినంత మోసం చేసిన చంద్రబాబు మళ్ళీ ప్రజలను మోసం చెయ్యటానికి రెడీ అవుతున్నాడని జగన్ ప్రజలను అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. పైగా 75 ఏళ్ల ముసలాయన ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నానంటూ డ్రామా చేస్తున్నారని జగన్ టార్గెట్ చేశారు. ఈ సమయంలో చంద్రబాబు మోసాన్ని దత్తపుత్రుడు బలపరుస్తున్నాడని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరిలో ఒకరు వెన్నుపోటు వీరుడైతే, ఇంకొకరు ప్యాకేజి శూరుడు అని జగన్ ర్యాగింగ్ చేశారు!!
ఈ సందర్భంగా రైతులను, అవ్వాతాతలను ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడిచారని విమర్శించిన జగన్… చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ “సామాజిక అన్యాయం” చేయడం బాగా తెలుసని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా… తోడేళ్ళు అన్ని ఏకమవుతున్నాయని హెచ్చరించే ప్రయత్నం చేసిన జగన్… వారిని నమ్మకండి అంటూ ప్రజలకు సూచించారు!