ఒకవైపేమో దాదాపు ఆరుమాసాలుగా ా దాడులపై చంద్రబాబునాయుడు పార్టీలోని ముఖ్యులను అప్రమత్తం చేస్తున్నారు. ఇంకోవైపేమో ఎన్నిదాడులైనా చేసుకోండంటూ సిఎం రమేష్ తాజాగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐటి దాడులు, ఈడీ దాడులు జరుగుతున్నా కూడాాా లెక్కలేకుండా మాట్లాడుతున్నారంటే ఏమనర్ధం ? అంత ధీమాగా ఉండటానికి కారణాలేమై ఉంటాయి ?
తన కార్యాలయాలు, ఇళ్ళపై ఎన్ని దాడులైనా, ఎవరితోనైనా దాడులు చేయించుకోవచ్చంటూ సిఎం రమేష్ కేంద్రానికి సవాలు విసిరినట్లుగా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈరోజు ఉదయం చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు, తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కార్యాలయాలు, ఇళ్ళపై ఐటి దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఏకాకాలంలో కడప, విజయవాడ, హైదరాబాద్ లోని ఇళ్ళపై సుమారు 100 మంది ఐటి అధికారులు దాడులు చేయటం పార్టీలో కలకలం రేపుతోంది.
మొన్న కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ్యుడు సుజనా చౌదరి కార్యాలయాలపైన కూడా ఈడీ అధికారులు దాడులు జరపటం, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవటంతో మంత్రులు, నేతల్లో టెన్షన్ మొదలైంది. తనపై దాడుల గురించి ఢిల్లీలో రమేష్ మాట్లాడుతూ, ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత, కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రమంత్రులను నిలదీస్తున్నందుకే తమపై కేంద్రం దాడులు చేయిస్తోందంటూ ఎదురుదాడి చేయటం విచిత్రంగా ఉంది.
ఏపిలో పెట్టుబడులు రాకుండా కేంద్రం కుట్రలు చేస్తోందంటూ చంద్రబాబు పాటనే వినిపించారునుకోండి అది వేరే సంగతి. ఎన్నికల ముందు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించాలని బిజెపి అనుకుంటున్నట్లు సిఎం మండిపడ్డారు. నిజానికి ఏపిలో బిజెపి పరిస్ధితి గురించి అందరికీ తెలిసిందే. ఇక, బిజెపి కోసం టిడిపిని భయపెట్టటమేంటో రమేష్ కే తెలియాలి. కేంద్రం ఏం చేసినా భయపడేది లేదని సవాలు విసిరటమే గమనార్హం.
నిజమే తనతో పాటు లోకేష్, మంత్రులు, ముఖ్య నేతలపై ఐటి, ఈడి దాడులు జరుగుతాయంటూ చంద్రబాబు ఎప్పటి నుండో చెబుతున్నారు. దాడులను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలంటూ చంద్రబాబు హెచ్చరించారు. చంద్రబాబు ముందే చెప్పిన తర్వాత అనుమానం ఉన్నవాళ్ళంతా జాగ్రత్త పడకుండా ఎందుకుంటారు ? ఐటి, ఈడీ దాడులను ఎదుర్కోవటానికి అవసరమైన అన్నీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత తీరిగ్గా వారిపై ఐటి, ఈడి దాడులు జరిగితే మాత్రం ఉపయోగమేంటి ? ఈ దాడులు చాలా కాలం ముందే జరుగుండాల్సింది. ఇపుడు దాడులు చేయటం వల్ల ఏం ఉపయోగముంటుందో దర్యాప్తు సంస్ధలే చెప్పాలి.