టీడీపీతోనే మా ప్రయాణం: జనసేనాని స్పష్టతనిచ్చేసినట్లే.!

‘మేం టీడీపీతోనే పొత్తు పెట్టుకుంటాం. ముఖ్యమంత్రి పదవి కూడా అడగబోం. కొన్ని నియోజకవర్గాల్లో మా బలం 35 శాతానికి పైగా పెరిగింది. అన్ని చోట్లా అదే  స్థాయిలో బలం వుందని చెప్పలేను. కొన్ని చోట్ల చాలా తక్కువ ఓటు బ్యాంకు మాత్రమే వుంది.. ముఖ్యమంత్రి పదవి అడిగితే వచ్చేది కాదు. బలం లేకుండా ఎలా పదవి అడగగలం..?’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిజానికి, జనసేన మద్దతుదారుల నెత్తిన జనసేనాని పెద్ద బాంబు పేల్చినట్లే అర్థమవుతోంది. రేపో మాపో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతారనే ఆలోచనతో వున్నారు జనసైనికులు, జనసేన పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు.

కానీ, ఇప్పట్లో అలాంటి అవకాశమే లేదని జనసేనాని తేల్చి చెప్పేసినట్లయ్యింది. చంద్రబాబుకి లైన్ క్లియర్ చేసేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే, టీడీపీకి జనసేన బేషరతుగా మద్దతిస్తుందని జనసేనాని ప్రకటించేసినట్లే.

ఇప్పుడిక టీడీపీ ఇచ్చే సీట్లతో జనసేన సరిపెట్టుకోవాల్సి వుంటుంది. అలాగైనా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని బహుశా జనసేనాని అనుకుంటున్నారేమో.! నిజానికి, ఈ ఆలోచన 2014 ఎన్నికల సమయంలోనే జనసేనాని చేసి వుండాల్సింది. ఇప్పుడేమో ఆలస్యమైపోయింది.

తొమ్మిదేళ్ళ సమయం.. చిన్న విషయం కాదు.! రెండు పార్టీల మధ్యా పొత్తు కుదిరినా, టీడీపీ వ్యూహాలకు జనసేని చిత్తయిపోవడం ఖాయం. అయినా, అది తర్వాతి సంగతి. ముందైతే, వైసీపీని ఢీకొట్టడం టీడీపీ – జనసేనకు అంత తేలికైన విషయం కాదు.