ఆ విషయంలో తెలంగాణదే పైచేయి.. సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారో?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని చాలామంది భావిస్తున్నారు. సీఎం జగన్ సైతం సంక్షేమ పథకాలకు ఇస్తున్న స్థాయిలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఎనిమిది సంవత్సరాలు కాగా తెలంగాణలో ఊహించని స్థాయిలో అభివృద్ధి జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అభివృద్ధి దిశగా అడుగులు పడటం లేదు.

కనీస మౌలిక వసతులను కల్పించడంలో కూడా జగన్ సర్కార్ విఫలమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నీతి అయోగ్ ర్యాంకులను ప్రకటించగా ఈ ర్యాంకులలో తెలంగాణ ముందువరసలో ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం మంచి ర్యాంకులను సొంతం చేసుకోలేదు. ఇన్నోవేషన్ ఇండెక్స్ విభాగంలో తెలంగాణ 17.66 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా ఏపీ మాత్రం 13.32 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

పెర్ఫార్మర్స్ విభాగంలో తెలంగాణ తొలి స్థానంలో ఉండగా ఏపీ మాత్రం 14వ స్థానంలో ఉండటం గమనార్హం. ఎనేబులర్స్ విభాగంలో తెలంగాణ 4వ స్థానంలో ఉండగా ఏపీ 8వ స్థానంలో నిలిచింది. ఏ ర్యాంక్ అయినా తెలంగాణ పైకి వెళుతుంటే ఏపీ కిందికి వెళుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్టార్టప్ లకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి.

ఏపీలో మాత్రం స్టార్టప్ లకు అనుకూల పరిస్థితులు లేవని యువతకు ఉపాధి అవకాశాలు పెరగడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అనుకుంటే అందుకు భిన్నంగా జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ర్యాంకుల విషయంలో సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఏపీ సర్కార్ నుంచి ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడకపోవడంతో యువత తీవ్ర నిరాశలో ఉన్నారు. సీఎం జగన్ పథకాలను బాగానే అమలు చేస్తున్నా కొన్ని విషయాలకు సంబంధించి ఫెయిల్ అవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.