విశాఖ ఉక్కు పరిశ్రమపై సర్వ హక్కులూ కేంద్రానికే వున్నాయనీ, నష్టాల్లో వుందని చెప్పి కేంద్రం ఈ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించాలనుకోవడం తగదని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. విశాఖ పర్యటనలో భాగంగా విశాఖ ఉక్కు పరిశ్రమకు చెందిన కార్మిక సంఘాల ప్రతినిథులతో భేటీ అయిన వైఎస్ జగన్, విశాఖ ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంతంగా గనులు లేవనీ, నష్టాలను తగ్గించుకునే మార్గాల్ని అన్వేషించాలి తప్ప, ప్రైవేటీకరణ చేయకూడదనే విషయాన్ని కేంద్రానికి తాను రాసిన లేఖ ద్వారా తెలిపానన్నారు. కాగా, విశాఖ స్టీలు ప్లాంటుపై కన్నేసిన ‘పోస్కో’ సంస్థ ప్రతినిథులు తనను గతంలో కలిసిన మాట వాస్తవమేనని వైఎస్ జగన్ చెప్పారు. కడప, కృష్ణపట్నం, భావనపాడుల్లో ఏదో ఒక చోట స్టీలు ప్లాంటు ఏర్పాటు గురించి మాత్రమే తమ మధ్య చర్చలు జరిగాయనీ, కడపలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేస్తే బావుంటుందని తాను వారికి సూచించానని వైఎస్ జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
“దేవుని ఆశీస్సులతో స్టీల్‌ప్లాంట్ విషయంపై కేంద్రం ఆలోచనలో మార్పు వస్తుందని భావిస్తున్నానని” ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయంలో ఎలాంటి మార్పు లేకపోతే.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అనుకూలంగా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామని జగన్ ప్రకటించారు. స్టీల్ ఉత్పత్తికి అంతరాయం లేకుండా ఉద్యమించాలని కోరారు. పొస్కో వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు వచ్చే అవకాశాలు ఉండవని జగన్ చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఇప్పటికే కేంద్రం ప్రకటన చేయడం, పలు దఫాలుగా పోస్కో కేంద్రంతోనూ, విశాఖ ఉక్కు యాజమాన్యంతోనూ సంప్రదింపులు చేపట్టడం… ఇవన్నీ జరిగాక, కేంద్రం వెనక్కి తగ్గుతుందని ఎలా అనుకోగలం…? సీఎం గారు చెప్పేవన్నీ కంటి తుడుపు మాటలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.