AP Politics: ఇద్దరి మధ్య ఎంత వైరుధ్యం?

Chandrababu – YS Jagan: రెండు ప్రత్యర్థి పార్టీలకు చెందిన అధినేతలుగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మధ్య వివిధ అంశాలకు సంబంధించి వారి ఆలోచనా ధోరణిలో ఎంతో వ్యత్యాసం ఉండవచ్చు. వివిధ సందర్భాల్లో వారు స్పందించే విధానంలో కూడా తేడా ఉండవచ్చు. కానీ ప్రజాపాలన విషయంలో కూడా ఇంత వైరుధ్యమా? అని రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఇటీవల చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలకు అందరూ అవాక్కవుతున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా…. ‘ వైఎస్సార్‌ సీపీ నేతలకు చిన్న పని చేసి పెట్టినా ఊరుకోనేది లేదు. అది అధికారులైనా, ప్రజా ప్రతినిధులైనా సరే. వైఎస్సార్‌ సీపీ వాళ్లకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గాని ఎటువంటి ఉపకారం చేయొద్దు. వాళ్లకు ఉపకారం చేస్తే పాముకు పాలు పోసినట్టే’. ఇవీ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షంపై కక్షతో, బహిరంగంగా ఇలా మాట్లాడడంతో సభకు హాజరైనవారే కాక మీడియా ద్వారా ఈ వ్యాఖ్యలు చూసినవారు సైతం షాక్‌ అయ్యారు. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా కాకుండా తెలుగుదేశం పార్టీకి సీఎంలా వ్యవహరిస్తున్నారని ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందని వైఎస్సార్‌ సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. సీనియర్‌ రాజకీయ వేత్తగా, నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన వ్యక్తిగా చంద్రబాబు పబ్లిక్‌గా ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదని సొంత పార్టీలోని నాయకులు కూడా అంటున్నారు.

అయితే ఈ సందర్భంలో తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజల పట్ల వ్యవహరించిన తీరును, ఇప్పటి సీఎం చంద్రబాబు వైఖరితో పోల్చి బాబు వైఖరిని వైఎస్సార్‌ సీపీ నేతలు తప్పుపడుతున్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎంగా జగన్‌ పలు సందర్భాల్లో అన్న మాటలను గుర్తు చేస్తున్నారు. ‘సంక్షేమ పథకాల అమలు విషయంలో కులం చూడం. మతం చూడం. ప్రాంతం చూడం. రాజకీయాలు చూడం. పార్టీలు చూడం. నాకు ఓటు వేయకపోయినా ఫరావాలేదు. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ పథకం అందాల్సిందే. ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తర్వాత అందరూ నా వాళ్లే’. అని సీఎంగా జగన్‌ అటు అధికారులకు, ఇటు మంత్రులకు, పార్టీ నేతలకు పదే పదే గుర్తు చేసేవారు. ముఖ్యమంత్రిగా ఎవరూ పనిచేస్తున్నా రాష్ట్రంలోని ప్రజలందరినీ తన వారిగా చూడాలి అనే ఉద్దేశంలో జగన్‌ ఆ విధంగా చెప్పడమే కాకుండా చిత్తశుద్ధితో ఆ మాటలకు కట్టుబడి పనిచేశారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

చంద్రబాబు చెప్పినట్టు పాలన సాగితే వైఎస్సార్‌ సీపీ వాళ్లకు అంటే ఆ పార్టీ నాయకులకు, అభిమానులకు ఏ పనీ చేయకుంటే రాష్ట్రంలో దాదాపు 40 శాతం మంది ఓటర్లకు ఈ ప్రభుత్వంలో ఏ పనులూ జరగవు. అంటే దాదాపు కోటి 19 లక్షల మంది ఓటర్లను పక్కనబెట్టి తమ కూటమి పార్టీలకు ఓట్లు వేసిన వారి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్న మాట!

చంద్రబాబు అసలు నిజ స్వరూపం ఇదేనని, ఆయన గతంలో కూడా ముఖ్యమంత్రిగా, ఆయన పార్టీ వారి కోసమే పని చేశారు తప్ప ప్రజలందరి సంక్షేమం కోసం పాటుపడలేదని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు. 2014 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయవాడలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ వద్దకు ఏ పని మీద వచ్చినా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి వాటిని పూర్తి చేయండి అని ఆదేశించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో చాలా పెద్ద దుమారం లేపాయి.

ఎన్నికల వేళ ఓట్ల కోసం జనానికి అనేక హామీలు ఇవ్వడం. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలకు తూచ్‌ చెప్పేయడం ఆయనకు అలవాటేనని విమర్శిస్తున్నారు. 2014 ఎన్నికల్లో రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, 2,000 చొప్పున నిరుద్యోగ భృతి హామీలు ఇచ్చిన ఆయన వాటిని అందరికీ అమలు చేయలేదని గుర్తుచేస్తున్నారు. అదే జగన్‌మోహన్‌రెడ్డి అయితే ఇచ్చిన హామీల్లో 99 శాతం కచ్చితంగా అమలు చేశారని, ఆ ఒక్క శాతం హామీలను అమలు చేయకపోవడానికి గల కారణాలను, సాంకేతిక ఇబ్బందులను జనానికి వివరించారని చెబుతున్నారు. ప్రజల పట్ల బాధ్యత ఉన్న నాయకుడు కనుకనే జగన్‌ ఎన్నికల హామీలను ఎన్ని ఇబ్బందులెదురైనా అమలు చేశారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంది కనుకే తన ఐదేళ్ల పాలనలో డీబీటీ, నాన్‌ డీబీటీ కలిపి 4 లక్షల కోట్ల రూపాయలకు పైబడి డబ్బును సమాజంలోని వివిధ వర్గాల వారికి పంపిణీ చేశారని గుర్తు చేస్తున్నారు.

ఎన్నికల మేనిఫెస్టో అంటే తమకు ఒక భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ అని చెప్పిన నాయకుడు మా జగన్‌ అని వైఎస్సార్‌ సీపీ నేతలు సగర్వంగా చెబుతున్నారు. అదే చంద్రబాబునాయుడు గత ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌తో కలిపి 143 హామీలు ఇచ్చారు. ఇటీవలే మీడియా సమావేశం నిర్వహించి ఆ హామీలను అమలు చేయడానికి ఆర్థిక పరిస్థితి అనుమతించడం లేదని, సంపదను పెంచి ఆ తర్వాత హామీలను అమలు చేస్తానని చెప్పారు. మేనిఫెస్టో అమలుకు సంబంధించి చంద్రబాబుకు ఎటువంటి కమిట్‌మెంట్‌ లేదని జనం ఇప్పటికైనా గ్రహించాలని వైఎస్సార్‌ సీపీ నేతలు కోరుతున్నారు.

పక్షపాతం లేకుండా, రాగద్వేసాలకు అతీతంగా, రాజ్యాంగాన్ని, శాసనాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు న్యాయం చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేసిన చంద్రబాబు ఇప్పుడు రాజ్యాంగాన్ని మరచి మాట్లాడడం తగదని చెబుతున్నారు. రాజకీయమంటే ప్రజలందరికీ మేలు చేయడమే కాని తమ పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం పనిచేయడం కాదని సీనియర్‌ నేత అయిన చంద్రబాబు ఇప్పటికైనా గ్రహించాలని, ఆయన తన అనుభవాన్ని టీడీపీ బాగు కోసం కాకుండా, ఆంధ్రప్రదేశ్‌ అభ్యుదయానికి వినియోగించాలని రాజకీయ పరిశీలకులు కూడా సూచిస్తున్నారు.