దేశవ్యాప్తంగా దీపావళి పండుగ ఉత్సాహం అంబరాన్ని తాకుతున్న వేళ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా విజయవాడ నగరంలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన బీసెంట్ రోడ్‌లో పర్యటించి పండుగ సందడిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిరు, వీధి వ్యాపారులు, షాపుల యజమానులు, పౌరులతో ఆప్యాయంగా ముచ్చటించి, వారి సమస్యలను, జీఎస్టీ సంస్కరణల ప్రభావాలను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా… చింతజపూడి దుర్గారావు అనే వీధి వ్యాపారితో మాట్లాడి, ఆయన విక్రయించే ప్రమిదలు, జ్యూట్ బ్యాగుల వ్యాపారంపై జీఎస్టీ తగ్గింపు ప్రభావం గురించి ఆరా తీశారు. చదలవాడ వెంకటకృష్ణారావు అనే చెప్పుల షాపును సందర్శించి, జీఎస్టీ తగ్గింపుతో చెప్పుల ధరలు ఎంతమేర తగ్గాయి, విక్రయాలు ఎలా ఉన్నాయని అడిగారు. ఒక బట్టల షాపునకు వెళ్లి, అక్కడ సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్న గొడవర్తి లక్ష్మితో పండుగ సీజన్‌లో విక్రయాల తీరుపై మాట్లాడారు. కిరాణా షాపు నిర్వాహకుడు బొడ్డు శ్రీనివాస్‌తో మాట్లాడి, నిత్యావసర వస్తువుల ధరల్లో జీఎస్టీ తగ్గింపుతో వచ్చిన మార్పులు, గత ఏడాదితో పోలిస్తే ధరల వ్యత్యాసం గురించి ప్రశ్నించారు. ప్రస్తుతం బియ్యం, చక్కెర, నూనెల ధరలు కొంత స్థిరంగా ఉన్నాయని శ్రీనివాస్ ముఖ్యమంత్రికి తెలిపారు.

ప్రజలతో మమేకం, దీపావళి శుభాకాంక్షలు:
పర్యటనలో భాగంగా షాపింగ్‌కి వచ్చిన పౌరులతోనూ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రజలతో కరచాలనం చేసి, సెల్ఫీలు దిగి, చిన్నారులకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి అకస్మాత్తుగా తమ మధ్యకు రావడంతో వ్యాపారులు, వినియోగదారులు ఆశ్చర్యంతో పాటు సంతోషం వ్యక్తం చేశారు.
బీసెంట్ రోడ్ మొత్తం పండుగ వెలుగులతో మెరిసిపోతూ, రంగురంగుల లైట్లతో అలంకరించిన దుకాణాలు, కొనుగోలుదారులు క్యూలతో మార్కెట్ ప్రాంతం మొత్తం ఉత్సాహంగా కనిపించింది. బట్టలు, మిఠాయిలు, పటాకుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

రాష్ట్ర ప్రజలకు సీఎం దీపావళి శుభాకాంక్షలు:
మరోవైపు, సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా.. “చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ” అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త కాంతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. లోకకంటకుడైన నరకాసురుడిని శ్రీకృష్ణుడు, సత్యభామ సంహరించిన రోజుగా దీపావళికి ఉన్న ప్రాశస్త్యాన్ని గుర్తుచేశారు.
“దీపం జ్యోతిః పరంబ్రహ్మ… దీపం సర్వతమోపహమ్ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే” అనే శ్లోకాన్ని ఉదహరిస్తూ, ఈ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సంతోషం, సౌభాగ్యాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

