YS Jagan: ఏ పార్టీ అధికారంలో వుంటే, ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి అవుతారు.! ప్రాంతీయ పార్టీల్లో వున్న సర్వసాధారణమైన పద్ధతి ఇది.! చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అధికారంలోకి వస్తే ఆయనే ముఖ్యమంత్రి. చిరంజీవి ముఖ్యమంత్రి అవుదామనే ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లక్ష్యం కూడా అదే.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్.. తెలంగాణ ముఖ్యమంత్రి.! అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలో వుంది గనుక, ఆయనే ముఖ్యమంత్రి. ఇందులో వింతేముంది.? రెడ్డి పార్టీలో కాపు నాయకుడు ముఖ్యమంత్రి అవగలడా.? అంటూ కొత్త ప్రశ్నను లేవనెత్తింది జనసేన పార్టీ. వైసీపీలోని కాపు నాయకులంతా ఈ విషయమై ఆత్మవిమర్శ చేసుకోవాలన్నది జనసేన సంధిస్తోన్న ప్రశ్న.
మరి, జనసేనలోని రెడ్డి సామాజిక వర్గ నేతలంతా వున్నపళంగా జనసేనను వీడి వైసీపీలో చేరిపోవాలేమో.! ఏం రాజకీయాలు ఇవి.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు రాజకీయాల్లో కీలక పదవులు పొందుతున్న మాట వాస్తవం. ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. ఎప్పటినుంచో నడుస్తున్న వ్యవహారమే.
కమ్మ సామాజిక వర్గం కాకుండా, ఇంకో సామాజిక వర్గానికి టీడీపీలో ముఖ్యమంత్రి పదవి దక్కే ఛాన్సే లేదు. టీడీపీని ఈ విషయమై గతంలో ప్రశ్నించని జనసేన, ఇప్పుడు వైసీపీని ప్రశ్నిస్తోంది. అబ్బే, మేం గతంలో కూడా ప్రశ్నించాం.. అంటూ జనసేన వింత వాదనను తెరపైకి తెస్తే మాట్లాడుకోవడానికేముంది.?
కుల, మత ప్రస్తావన లేని రాజకీయం.. అంటూ జనసేన పైకి చాలా మాటలు చెబుతోంది. కానీ, కులం చుట్టూనే ఫక్తు రాజకీయాలు చేస్తోంది జనసేన కూడా. ఈ విషయంలో వైసీపీ, టీడీపీలతో పోల్చితే జనసేన ఎందుకు ప్రత్యేకం.?