ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి ముమ్మాటికి హత్యాయత్నమే అంటూ విచారణలో తేలిపోయింది. మొన్న 25వ తేదీన హైదరాబాద్ కు వచ్చేందుకు వైసిపి అధ్యక్షుడు విశాఖపట్నం విమానాశ్రయం లాంజ్ లో ఉన్నపుడు దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సెల్ఫీ తీసుకుంటానంటూ శ్రీనివాస్ అనే యువకుడు అడిగాడు. అందుకు జగన్ ఒప్పుకున్నాడు. దాంతో జగన్ కు దగ్గరగా వచ్చిన శ్రీనివాస్ ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. చివరి నిముషంలో ప్రమాదాన్ని గ్రహించిన జగన్ పక్కకు తప్పుకోవటంతో గొంతులో దిగాల్సిన కత్తి ఎడమభుజం క్రింద దిగింది. సరే తర్వాత విమానాశ్రయంలో ఉన్న సిఐఎస్ఎఫ్ సిబ్బంది నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.
ఘటన జరిగిన రోజే కేంద్రప్రభుత్వం సిఐఎస్ఎఫ్ విచారణకు ఆదేశించింది. ఐదురోజల పాటు వివిధ కోణాల్లో దాడి ఘటనను విచారించిన సిఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు చివరకు జగన్ పై జరిగింది హత్యాయత్నమే అని తేల్చేశారు. కుట్ర పూరితంగానే జగన్ పై నిందితుడు కత్తితో దాడి చేశాడని సిఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్, చెన్నైలకు చెందిన ఉన్నతాధికారులు విశాఖపట్నంలోని ఫ్యూజన్ ఫుడ్స్ క్యాంటిన్ ఓనర్ హర్షవర్ధన్ తో పాటు 100 మంది ప్రత్యక్ష సాక్ష్యులను కూడా విచారించారు. హత్యాయత్నం ఘటనకు విమానాశ్రయం ప్రాంగణాన్ని వేదికగా ఎంచుకోవంతో కేంద్రప్రభుత్వం సీరియస్ అయ్యింది.
విచారణలో భాగంగా విశాఖపట్నం విమానశ్రయంలో డ్యూటిలో ఉన్న సిఐఎస్ఎఫ్ సిబ్బందిని కూడా విచారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నపుడు అతని వద్ద ఏమేమి వస్తువులున్నాయో చెప్పారు. అయతే, సాయత్రం పోలీసులకు అప్పగించిన తర్వాత నిందితుడి జేబులో 11 లేఖ దొరికిందని చెప్పటాన్ని తప్పుపడుతున్నారు. శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నపుడు జేబులో కనబడని లేఖ సాయంత్రం పోలీసులకు హ్యాండోవర్ చేసినపుడు ఎక్కడి నుండి వచ్చిందన్నది ప్రశ్న. తమకు కనబడని లేఖ నిందితుడి వద్ద ఉన్నట్లు పోలీసులు తయారు చేసిన నివేదికలో సిఐఎస్ఎఫ్ అధికారులు సంతకాలు ఎందుకు చేశారన్నది కూడా అనుమానాలకు తావిస్తోంది.
కుట్రదారులు తమ ప్లాన్ అమలు చేసేందుకు వ్యూహాత్మకంగానే విమానాశ్రయాన్ని ఎంచుకున్నట్లు కూడా సిఐఎస్ఎఫ్ విచారణలో నిర్ధారణకు వచ్చింది. కాకపోతే కుట్రకు ప్లాన్ చేసిందెవరు ? ఎందుకు చేశారు ? దాడికి శ్రీనివాస్ నే ఎందుకు ఎంచుకున్నారు ? హత్యాయత్నం చేయటానికి ఎంత డీల్ కుదుర్చుకున్నారు ? అన్న విషయాలు తేలాల్సుంది. ఇప్పటికైతే తమ విచారణ నివేదికను ఢిల్లాలోని సిఐఎస్ఎఫ్ కేంద్ర కార్యాలయానికి అందించారు. మరి ఈ నివేదిక ఆధారంగా కేంద్రం ఎటువంటి చర్యలు తసుకుంటుందో చూడాలి.