Cinema Ticket : సినిమా టిక్కెట్లు.. పెంచింది పొలిటికల్ హీటు.!

Cinema Ticket : సినిమా టిక్కెట్ల విషయమై నేడో రేపో కీలక నిర్ణయం వైసీపీ ప్రభుత్వం నుంచి రాబోతోందట. అయినా, ఎన్ని విషయాల్లో ‘యూ టర్నులు’ తీసుకోలేదు.? శాసన మండలి వ్యవహారంతో పోల్చితే, సినిమా టిక్కెట్ల వ్యవహారం పెద్ద సీరియస్ ఏమీ కాదన్నది వైసీపీ వర్గాల్లో నలుగుతోన్న చర్చ.

రాష్ట్రంలో సినిమా థియేటర్లపై తనిఖీల సందర్భంగా కొందరు వైసీపీ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కానీ, తప్పదు. మొత్తంగా సినిమా థియేటర్లన్నిటిలోనూ పరిస్థితులపై లోతైన విచారణ జరిపించి, ప్రజలకు మెరుగైన వినోదాన్ని, తక్కువ ధరకు అందించాలని వైసీపీ సర్కారు భావిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే, ఈ విషయంలో వైసీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్న విమర్శ లేకపోలేదు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రో ధరలు, పండగ వేళ ఆర్టీసీ ఛార్జీల ధరలతో పోల్చితే, సినిమా టిక్కెట్ల ధరలేమీ ఎక్కువ కాదు. వాస్తవానికి సినిమా అనేది తప్పనిసరి అంశం కానే కాదు.

ఈ విషయమై వైసీపీ సర్కారుకి ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువవుతున్నాయి. తేనెతుట్టెను కదిపి, నష్టపోతున్నాం.. అన్న భావన వైసీపీలో వ్యక్తమవుతోంది. తమ థియేటర్లకూ తిప్పలు ఎదురవుతుండడంతో కొందరు వైసీపీ నేతలు, అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారట.

ఇంకోపక్క పరిశ్రమ నుంచి కూడా సానుకూల అభ్యర్థనలు వస్తుండడంతో, ఈ సమయంలోనే కీలక నిర్ణయం.. అందునా సానుకూల నిర్ణయం తీసుకోవడం మంచిదన్న భావన వైసీపీ అధిష్టానం వ్యక్తం చేస్తోందని అంటున్నారు. మరి, పెరిగిన పొలిటికల్ హీటుకి.. సినిమా టిక్కెట్ల విషయంలో కాస్త తగ్గడం ద్వారా ముగింపు పలుకుతుందా జగన్ సర్కారు.? వేచి చూడాలిక.