‘బ్రో’ సినిమాకి వైసీపీ దెబ్బ గట్టిగానే తగిలింది. సినిమాపై విపరీతమైన నెగెటివిటీని వైసీపీ క్రియేట్ చేసింది. ఎంతైనా రాజకీయ ప్రత్యర్థి కదా.! పవన్ కళ్యాణ్ మీద ఆ మాత్రం నెగెటివిటీని వైసీపీ ఎందుకు చూపించకుండా వుంటుంది.?
సినిమాలోని పొలిటికల్ టచ్ వున్న సెటైర్లు, వైసీపీని కొంత ఇబ్బంది పెట్టాయి. దాంతో, ‘బ్రో’ సినిమాని గట్టిగా ఆడేసుకున్నారు వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు. మంత్రులు కూడా మీడియా ముందుకొచ్చి, ‘బ్రో’ సినిమాని డిజాస్టర్‌గా అభివర్ణించారు. సరే, ఇదంతా ‘బ్రో’ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిందన్న వాదనా లేకపోలేదనుకోండి.. అది వేరే సంగతి.
ఇదిలా వుంటే, ‘భోళా శంకర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైపర్ ఆది పంచ్ డైలాగులు, నేరుగా వైసీపీని తాకాయి. హైపర్ ఆది జనసేన మనిషి. గతంలో, జనసేన పార్టీకి చెందిన ఓ సభలో, హైపర్ ఆది చెలరేగిపోయాడు. అది రాజకీయం. ఇది సినిమా.! సినిమా ఫంక్షన్‌లో హైపర్ ఆది రాజకీయ విమర్శలు చేయడమేంటి.? వాటిని విని మెగాస్టార్ చిరంజీవి మురిసిపోవడమేంటి.?
‘నా తమ్ముడు..’ అంటూ పవన్ కళ్యాణ్‌ని చిరంజీవి వెనకేసుకురావడంలో తప్పు లేదు. కానీ, హైపర్ ఆది విషయంలో చిరంజీవి, ఒకింత వారించి వుండాల్సిందేమో.! ‘బ్రో’ తరహాలోనే, ‘బోళా శంకర్’ని వైసీపీ టార్గెట్ చేస్తేనో.! అసలే, టీడీపీ రెడీగా వుంది ‘భోళా శంకర్’ సినిమాపై నెగెటివిటీని ప్రచారం చేయడానికి. దానికి వైసీపీ కూడా తోడైతే ‘భోళా శంకర్’ పరిస్థితి ఏమవుతుందో.!
పవన్ కళ్యాణ్‌పై రాజకీయ ద్వేషం వున్నా, మెగాస్టార్ చిరంజీవి అంటే ఒకింత గౌరవ భావంతోనే వుంటోంది వైసీపీ. తమ్ముడ్ని తిట్టి, అన్నయ్యని పొగిడితే సరిపోతుందా.? అన్నయ్యకి తెలియదా.? అంటూ హైపర్ ఆది వేసిన పంచ్ డైలాగ్.. ‘భోళా శంకర్’ మీద చాలా గట్టి ఇంపాక్ట్‌నే చూపబోతోందిట.
రాజకీయాల్లోకి సినిమాల్ని లాగకండి.. అని ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. మరి, సినిమా ఈవెంట్లలో రాజకీయాలు లాగొచ్చా.? అని అప్పుడే, వైసీపీ మద్దతుదారులు ప్రశ్నించడం మొదలు పెట్టారు.