వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వరుస కేసులలో చిక్కుకుంటూ నానా అగచాట్లు పడుతున్న చింతమనేని ప్రభాకర్ మీద తాజాగా మరో కేసు నమోదైంది. పంచాయతీ ఎన్నికల నిబంధనలు అతిక్రమించి, అధికారుల అనుమతులు తీసుకోకుండా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ తెలిపారు.
పెదవేగి మండలం వేగి వాడలో టీడీపీ కార్యకర్తలతో కలిసి ద్విచక్ర వాహనాలతో చింతమనేని ర్యాలీ నిర్వహించారు. ఇందుకు అనుమతులు తీసుకో లేదంటూ ఆయన పై, కొంత మంది కార్యకర్తలపై పెద వేగి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ మాట్లాడుతూ… ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో చింతమనేనితో పాటు, ఆయన అనుచరులు కొంతమందిపై పెదవేగి పీఎస్ లో కేసు నమోదు చేశామని తెలిపారు. చింతమనేనిని, కార్యకర్తలను పెదవేగి పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారణ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల వేళ ఎవరైనా అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.