ఏపీలో టీడీపీ – జనసేన పొత్తులో ఉన్నాయా? ఈ ఎన్నికల్లో జనసేన అధినేతల్ పవన్ ఒంటరిగా పోటీచేస్తారా.. లేక, టీడీపీతో కలిసి వెళ్తారా అనే విషయంలో జనసేన అధినేతే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఏపీ రాజకీయాల్లో నెలకొని ఉంది. అయితే తాను మాత్రం పవన్ కోరితే తన దెందులూరు నియోజకవర్గం త్యాగం చేస్తానని చెబుతున్నారు చింతమనేని ప్రభాకర్!
అవును… ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్యేగా ఉంటూ పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేస్తూ, సంచలన పనిలు చేసి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన ఆయన.. మరోసారి అదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా… పవన్ దెందులూరు నియోజకవర్గానికి వచ్చి పోటీ చేస్తానంటే తన సీటు త్యాగం చేసేందుకు సిద్ధమని వెల్లడించారు.
అక్కడితో ఆగని చింతమనేని… పవన్ ను భుజాలపై ఎక్కించుకొని గెలిపిస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇన్ని చెప్పిన చింతమనేని… ఫైనల్ గా పొత్తుల విషయంలో ఫైనల్ నిరంఅయం చంద్రబాబుదే అని, తాను సీటు త్యాగం చేసే విషయంలో కూడా అల్టిమేట్ గా చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని చెప్పుకొచ్చారు.
కాగా… గతంలో పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ఓడిపోగా… దెందులూరు నియోజకవర్గంలో చింతమనేనిదీ అదే పరిస్థితి. గడిచిన ఎన్నికల్లో దెందులూరులో సీనియర్ నేత చింతమనేనిపై.. ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చిన వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి 16,131 మెజారిటీతో గెలిపొందారు.
దీంతో… ఓడిపోయిన సీటు త్యాగం చేయడంలో పెద్ద విషయం ఏముంది.. పాలకొల్లులో నిమ్మల రామానాయుడిని త్యాగం చేయమను అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!
మరోపక్క రాబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మరోసారి భీమవరం, గాజువాకలనుంచి పోటీచేస్తారా.. లేక మరింత సేఫ్ జోన్ లుగా భావిస్తున్న తిరుపతి, పిఠాపురం నియోజకవర్గాల్లో అదృష్టం పరీక్షించుకుంటారా అనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో… చింతమనేని పవన్ కు ఇలా ఒక ఆఫర్ ఇచ్చి పడేశారు! మరి పవన్ ఈ బంపర్ ఆఫర్ పై ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి!