ముఖ్యమంత్రి జగన్ సభ కోసం మహిళలు ‘చున్నీ’ తీయాల్సొచ్చిందా.?

టీడీపీ అనుకూల మీడియాలో ఓ వార్త హైలైట్ అవుతోంది. అదే, నిన్నటి నర్సాపురం సభలో, పోలీసులు భద్రతా కారణాల రీత్యా మహిళల చున్నీలు తొలగించాలని ఆదేశించారట.! ముఖ్యమంత్రి పాల్గొన్న సభ కావడంతో, సహజంగానే ఒకింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలుంటాయి. అయితే, మరీ చున్నీలు తొలగించాలనే ఆదేశాలు పోలీసులు ఎలా ఇవ్వగలరు.?

ఆదేశాలు ఇవ్వడమేంటి.? చున్నీల్ని తీస్తేగానీ, బహిరంగ సభలోకి మహిళల్ని అనుమతివ్వకపోతేనూ.! అలా మహిళలు తీసేసిన చున్నీలు పదుల సంఖ్యలో అక్కడ దర్శనమిచ్చాయి. ‘చున్నీలు తీస్తేగానీ, లోపలికి రానిచ్చేది లేదిని అధికారులు చెప్పారు’ అంటూ పలువురు మహిళలు వాపోయారు, సభ నుంచి వెనక్కి వెళ్ళిపోయారు కూడా.!

అసలు ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిందా.? నిజానికి, ఇలాంటి విషయాల్ని ప్రభుత్వంలో వున్నవారు, పార్టీ ముఖ్య నేతలు, అధినాయకుడి దృష్టికి తీసుకెళ్ళాల్సి వుంటుంది. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి భద్రత కోసమంటూ పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడమూ జరుగుతుంటుంది.

కానీ, అంతిమంగా ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతాయి. ‘ముందు ముందు మహిళలు తమ జుట్టు రంగు మార్చుకోవాల్సి వుంటుందనీ.. లేనిపక్షంలో గుండు చేయించుకుంటే తప్ప, సీఎం జగన్ సభలకు వెళ్ళకూడనే ఆదేశాలూ వస్తాయనీ’ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. చిన్న విషయాలకీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగానే వుంటోంది. మరి, ఈ చున్నీల విషయమై ఆ ఫ్యాక్ట్ చెక్ ఎలా స్పందిస్తుంది.? నిజమే అయితే, అధికారులపై ఎలాంటి చర్యలుంటాయి.?