ఆంధ్రాలో టిడిపి నేతల ఆస్తులపై ఐటి దాడులు వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) కూడా ఎంటర్ అయింది. మాజీ సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, టిడిపి ఎంపీ సుజనా చౌదరికి సంబంధించిన ఆస్తులపై సోదాలు జరిపింది. ఆయనకు సంబంధించిన సంస్థల్లో ఈడి సోదాలు నిర్వహించింది. తమిళనాడు చెన్నై నుండి వచ్చిన ఈడి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రెండు రోజుల క్రితం ఏపీతో పాటు హైదరాబాద్ లో సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీకి చెందిన సుజనా చౌదరి మార్చి 8, 2018న కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేశారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం నుంచి టిడిపి వైదొలిగింది. ఫలితంగా సుజనా చౌదరి (వైవి చౌదరి) మరొక క్యాబినెట్ మంత్రి అశోక్ గజపతి రాజుతో కలసి మంత్రివర్గంనుంచి తప్పుకోవలసివచ్చింది.
హైదరాబాద్ లో నిర్వహించిన సోదాల్లో ఒకే అడ్రెస్ పై వందకుపైగా ఆఫీసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్రమ లావాదేవీల నియంత్రణ చట్టం (పీఎల్ఎంఏ) కింద కోట్ల రూపాయల బ్యాంకు రుణాలకు సంబంధించిన పత్రాలను, నగదు లావాదేవీలకు చెందిన ఆధారాలను, పలు అగ్రిమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
మాజీ సిబిఐ చీఫ్ విజయరామారావు కుమారుడు కె.శ్రీనివాస్ కళ్యాణ్ రావుపై గతంలోనే సిబిఐ కేసు ఫైల్ చేసింది. తప్పుడు సమాచారం, నకిలీ డాక్యుమెంట్స్ తో శ్రీనివాస్ ౩౦౦ కోట్ల రూ. వరకు బ్యాంకులను మోసం చేసినట్లు 2016 లో సిబిఐ కేసు నమోదు చేసింది. శ్రీనివాస్ సుజనా చౌదరికి సంబంధించిన కంపెనీల్లో డైరెక్టర్ గా ఉన్నారు. కేసు విచారణలో భాగంగా అప్పట్లో సిబిఐ ఆఫీసర్స్ శ్రీనివాస్ ఆఫీసులు, ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీన పరుచుకున్నారు.
వీటిలో సుజనా చౌదరి సంస్థలతో శ్రీనివాస్ కి ప్రమేయం ఉన్నట్టు కొన్ని పత్రాలు బహిర్గతం అయ్యాయి. వందల కోట్ల ఇష్యూ కావడంతో ఈడి రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా చెన్నై ఈడి బృందం జరిపిన సోదాలు సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదని ఈడి హైదరాబాద్ జోన్ డిపార్ట్మెంట్ తెలిపింది. సుజనా చౌదరి సంస్థలపై ఈడి సోదాలు నిర్వహించిందని వస్తున్న ప్రచారంపై ఆ సంస్థకు చెందిన ప్రతినిధి స్పందించారు. శ్రీనివాస్ సంస్థలతో లావాదేవీలు ఉన్న కారణంగా ఆ వివరాలు సేకరించేందుకు ఈడి అధికారులు వచ్చారని తెలిపారు. మా సంస్థలపై ఎలాంటి సోదాలు జరగలేదని వెల్లడించారు.