బ్రేకింగ్ న్యూస్: ఏపీ మహిళా కాంగ్రెస్ నేతపై చీటింగ్ కేసు

కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మపై చీటింగ్ కేసు నమోదైంది. 2016 లో ఒక వ్యక్తి మృతి కేసులో రాజీ కుదురుస్తానని లక్ష రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని బాధితురాలు ఆరోపిస్తుంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న విజయవాడ పోలీసులు విచారణ చేపట్టారు.

బాధితులు

తన కుమారుడు చెరువులో పడి మృతి చెందగా వచ్చిన డబ్బును సుంకర పద్మశ్రీ ఇవ్వడం లేదని హఠాన్ మరియంబి అనే ముస్లిం మహిళ ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా వల్లభనేని ఎమ్మెల్యే వంశీ మోహన్ తో ఈ విషయాన్ని తెలుపగా ఆయన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయమని బాధితురాలికి సూచించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. రెండేళ్ల కిందట మరియంబి కుమారుడు డైరీ ఫామ్ లో పని చేస్తూ ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయాడు. అయితే డైరీ ఫామ్ యజమానిపై ఎలాంటి కేసు లేకుండా చూడటానికి సుంకర పద్మశ్రీ మధ్యవర్తిత్వం తీసుకుందని చెబుతున్నారు. లక్ష రూపాయలు బాధితురాలికి ఇచ్చేటట్టుగా ఒప్పందం కుదిర్చిన పద్మశ్రీ, ఆ డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని బాధితురాలు స్వయంగా ఆరోపించింది.

దీనిపై ఘాటుగా స్పందించారు సుంకర పద్మ. రాజకీయంగా ఎదుర్కోలేకనే వల్లభనేని వంశీ మోహన్ నాపై ఇటువంటి కుట్ర పన్నారని ఆమె విరుచుకు పడ్డారు. కక్ష్య పూరితంగానే టీడీపీ ఎమ్మెల్యే వంశీ నాపైన ఇటువంటి కేసు పెట్టించారని ఆమె ఆరోపించారు. మృతి చెందిన వ్యక్తి కుటుంబీకులు నావద్దకు వచ్చినప్పుడు నేను వారిని పోలీసుల వద్దకు పంపించానని, అంతకు మించి ఈ వ్యవహారంతో నాకు ఎటువంటి సంబంధం లేదని ఆమె తెలిపారు. నిజంగా నేను లక్ష రూపాయలు తీసుకున్నాని రుజువైతే మీడియా ముందే లక్ష రూపాయలు పెడతాను…నాకు డబ్బు ఇచ్చిన వారిని వచ్చి తీసుకెళ్ళమనండి అంటూ ఆవిడ ఛాలెంజ్ విసిరారు. పిచ్చి పిచ్చిగా తప్పుడు మాటలు మాట్లాడవద్దంటూ ఆవిడ వల్లభనేని వంశీని హెచ్చరించారు.

సుంకర పద్మశ్రీ ఆరోపణలను అంతే ధీటుగా ఖండించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. ఆమెపై కేసు పెట్టాల్సిన అవసరం నాకు లేదన్నారు. పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నవారికి త్వరలోనే పరువు నష్టం నోటీసులు వెళ్తాయని హెచ్చరించారు. ఏ పార్టీ నేతలతోనూ తాను కక్ష్య పూరితంగా వ్యహరించలేదని తెలిపారు. బాధితురాలు గ్రామదర్శిని కార్యక్రమంలో ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకు వచ్చినప్పుడు..నా పక్కనే ఆత్కూరు ఎస్సై కూడా ఉన్నారు. నేను ఆవిడతో పోలీసులకు ఈ విషయాన్ని తెలిపి కేసు నమోదు చేయమని సూచించాను. ఇందులో నేను వ్యక్తిగతంగా పన్నిన కుట్రేమీ లేదన్నారు. నా నాలుగు సంవత్సరాల పదవీ కాలంలో నేను కావాలని ఎవరిపైనా కుట్ర పన్ని ఇటువంటి చర్యలు చేయలేదని స్పష్టం చేశారు. కావాలంటే ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిర్ధారించుకోవచ్చని సూచించారు వంశీ.