వైసీపీలో ధిక్కార స్వరం.! బుజ్జగింపులు నిజంగానే ఫలిస్తున్నాయా.?

మల్లాది విష్ణు మొహం చాటేశారు.. పార్ధసారధి కూడా పార్టీ నుంచి వస్తున్న పిలుపుని పట్టించుకోవడంలేదు.! ఇవి పైకి కనిపిస్తున్న నెగెటివిటీ మాత్రమే వైసీపీకి సంబంధించి. అదే సమయంలో, కొందరికి బుజ్జగింపులు బాగానే పని చేస్తున్నాయి.

‘అబ్బే నేను పార్టీని విమర్శించలేదు. అధికారుల మీదనే నా ఆవేదన..’ అంటూ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మెత్తబడిన వైనం అందరికీ తెలిసిందే. ‘టిక్కెట్టు వచ్చినా, రాకపోయినా పార్టీ కోసం పని చేస్తాం..’ అని పలువురు వైసీపీ ప్రజా ప్రతినిథులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, సగానికి పైగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు దొరక్కపోవచ్చు.

వైసీపీలో సీనియర్లు కొందరేమో తమకు టిక్కెట్టు దొరకదని తెలిసి, తమ వారసుల్ని రంగంలోకి దించి, ఎలాగోలా వారికి టిక్కెట్లను సాధించుకున్నారు. అధినేత జగన్ సూచనల్ని పాటించి, తమ ర్యాంకింగ్ మెరుగుపర్చుకుని, ఇంకొందరు టిక్కెట్లను సేఫ్ చేసుకున్నారు.

రాజకీయాల్లో ఖచ్చితంగా వ్యూహాలు వుంటాయ్. అభ్యర్థుల మార్పు వెనుక కూడా ఖచ్చితమైన వ్యూహం వుందని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. అయితే, ఎక్కువమంది అభ్యర్థుల మార్పు అనేది, ముమ్మాటికీ తప్పుడు సంకేతాల్ని పంపుతుంది పార్టీ శ్రేణుల్లోకీ, ప్రజల్లోకీ.!

పాలన అస్తవ్యస్తంగా వుండబట్టే, గెలిచే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చి, ఆ వైఫల్యాన్ని ఎమ్మెల్యేల మీదకు నెట్టేసి, కొత్త అభ్యర్థుల్ని రంగంలోకి దించుతున్నారన్న విమర్శ వైసీపీ మీద బలంగా వినిపిస్తోంది. ఇంకోపక్క, బుజ్జగింపుల పర్వం ఫలించకపోవడం కూడా వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారుతోంది కొందరు కీలక నేతల విషయంలో.