చంద్రబాబు కోరుకున్న తిట్లు అన్నీ తెలంగాణ నుంచి వచ్చినట్లేనా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ ముక్కీ మూలిగీ.. అన్నట్టుంది. తెలంగాణలో అయితే, ఆ పార్టీకి ఉనికే లేదు ప్రస్తుతానికి. పార్టీ అధ్యక్షుడయ్యేందుకు సొంత పార్టీలో ఎవరూ లేక, కాసాని జ్ఞానేశ్వర్‌ని బయట నుంచి తెచ్చుకున్నారు టీడీపీ అధినేత.. అదీ తెలంగాణ కోసం.

అయినాగానీ, చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఈసారి ఫలించాయ్. ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభతో ఒక్కసారిగా తెలంగాణలో టీడీపీ వుందన్నమాట.. అనే చర్చ జరగడానికి ఆస్కారమేర్పడింది. తెలంగాణలో రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ అయిపోయింది లెండి..) నేతలు క్యూ కట్టారు టీడీపీని విమర్శించడానికి.

గత కొన్నాళ్ళుగా తెలుగు మీడియాలో తెలంగాణ టీడీపీ గురించిన చర్చ ఎక్కడా జరగలేదు. వైసీపీ అనుకూల మీడియా కూడా తెలంగాణ టీడీపీ గురించి గట్టిగానే రాయాల్సి వచ్చింది. అదీ ఖమ్మంలో చంద్రబాబు ప్లాన్ చేసిన పబ్లిసిటీ స్టంట్ వర్కవుట్ అయిన తీరు.

తెలంగాణలో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా నిద్రలేచాయి. చాలా ఏళ్ళుగా నిద్రపోయిన టీడీపీ మద్దతుదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచినట్లయ్యింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయ్యారు. సైబరాబాద్ వ్యవస్థాపకుడంటూ చంద్రబాబుని కీర్తించడం మొదలు పెట్టారు తెలంగాణ తెలుగు తమ్ముళ్ళు.

గతంలోలా తెలంగాణ సెంటిమెంట్‌ని అడ్డం పెట్టి టీడీపీని తొక్కేయడానికి వీల్లేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి లేదు.. ఆ స్థానంలో బారత్ రాష్ట్ర సమితి వచ్చింది. భారత్ రాష్ట్ర సమితి కంటే నేటివిటీ పరంగా తెలుగుదేశం పార్టీ పేరే జనంలోకి వెళుతుందన్నది టీడీపీ భావన.