చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఎన్నో హోదాలు అనుభవించినా ఇప్పుడు మాత్రం ఆయన కేవలం ఏపీ రాజకీయాలకే పరిమితమయ్యారు. రాజకీయాలలో 40 ఏళ్ళ అనుభవం, 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. గాలి ఎటు ఉంటే అటు ఊగిపోవడం, ఊదరగొట్టే రాజకీయాలు చేయడం, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తన పంతం నెగ్గించుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి మారిపోయిన చంద్రబాబు తన అనుభవం, మోదీ, పవన్ మేనియాతో 2014లో గెలిచి ఏపీలో అధికారం చేపట్టారు. సీఎం అయిన తరువాత ఆయన గారు వెలగపెట్టిన అభివృద్ధి, దోపీడీ బాగోతాలు తెలుసుకున్న ఏపీ ప్రజలు 2019 ఎన్నికలలో జగన్‌ని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. అయితే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ సర్కార్‌ని ఎలా ఇరుకున పెట్టాలి అనే దాని గురించే ఆలోచిస్తున్నాడే తప్పా జాతీయ పార్టీ నాయకుడిని అనే విషయాన్ని చంద్రబాబు పూర్తిగా మరిచిపోయినట్టున్నాడు.
ఒకప్పుడు టీడీపీకి బలమైన నేతలు, క్యాడర్ ఉన్న తెలంగాణలో కూడా టీడీపీ మెల్లమెల్లగా కనుమరుగైపోతుంది. తెలంగాణలో 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ కూటమితో జతకట్టిన చంద్రబాబు ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగాడు. అయితే ప్రస్తుతం ఏపీలో కరోనాను కట్టడి చేయడంలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమయ్యిందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు సైతం జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
అయితే ఏపీతో పోల్చుకుంటే తెలంగాణాలో పరిస్థితి అద్వానంగా ఉంది. కేసుల లెక్కలలో పారదర్శకత లేదని, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నా,న్యాయస్థానం మండిపడుతున్నా కనీసం చంద్రబాబు కేసీఆర్ సర్కార్‌ని పల్లెత్తు మాట కూడా అనడంలేదు. ఏపీ ప్రజల పట్ల ఉన్న బాధ్యత, తెలంగాణా ప్రజల పట్ల చంద్రబాబు గారికి లేదా? లేక కేసీఆర్‌ని ఎదురించే దమ్ము, ధైర్యం లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో మొదలుతున్న ప్రశ్న. మరీ ఇలాంటి ప్రశ్నలకు చంద్రబాబు అండ్ కో బ్యాచ్ ఎలాంటి సమాధానాలు చెప్పుకుంటారో మరీ..!