పోలీసులు మనసు చంపుకుని పనిచేస్తున్నారట.! చంద్రబాబు ఉవాచ.!

టీడీపీ సభల్లో తొక్కిసలాటలు జరిగాయి.. రెండు ఘటనలలూ చంద్రబాబు సమక్షంలోనే జరిగినట్లు భావించాలేమో. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, ఏ కార్యక్రమాలు ఎలా ఇబ్బందికరంగా మారుతాయో తెలుసుకోలేరా.?

‘మా సభలకు పోటెత్తుతున్నారు..’ అని చెప్పుకోవాలనే కక్కుర్తి ప్రదర్శించి, పదకొండు మంది మరణానికి కారణమయ్యారు. పుష్కరాల సమయంలోనూ తొక్కిసలాటకి చంద్రబాబే నైతిక బాధ్యత వహించాల్సి వుంటుంది. సరే, కొన్ని ఘటనల్ని నివారించలేం. తొక్కిసలాటలు ఆ కోవలోకే వస్తాయ్.

కానీ, నైతిక బాధ్యత అనేది ఒకటేడుస్తుంది కదా.? అదెప్పడూ చంద్రబాబు తీసుకోరు. అదే ఆయన ప్రత్యేకత. పైగా, ‘పోలీసులు మనసు చంపుకుని పనిచేస్తున్నారు..’ అంటూ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.. కుప్పం పర్యటనలో.

తొక్కిసలాటల సమయంలో పోలీసుల వైఫల్యం సుస్పష్టం. కానీ, పోలీసు శాఖ సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. ఆపై రాజకీయ ఒత్తిళ్ళు. చంద్రబాబుకి తెలియదా, రాజకీయ ఒత్తిళ్ళు ఎలా వుంటాయో. ఎందుకంటే, తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అదే పోలీసు శాఖని రాచి రంపాన పెట్టేయలేదా.?

ఔను, పోలీసులు మనసు చంపుకునే పనిచేస్తుండొచ్చు. అలా మనసు చంపుకుని పనిచేయడమనేది తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా జరిగింది. ఆ విషయాన్ని పోలీసు శాఖలో ఉన్నతాధికారులు.. అందునా చంద్రబాబు హయాంలో పనిచేసేవారు గుర్తుచేసుకోకుండా వుంటారా.?