తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి తెలుగు ప్రజలకు, అందునా మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ‘స్నేహా బ్లాక్, రాజమహేంద్రవరం జైలు నుంచి’ అంటూ, డిజిటల్ సంతకం చేసిన చంద్రబాబు లేఖ బయటకు వచ్చింది.
ఈ లేఖలో, ‘నేను జైలులో లేను, మీ అందరి గుండెల్లో వున్నాను..’ అంటూ మొదలు పెట్టారు చంద్రబాబు. ‘మా గుండెల్లో మీరే వున్నారు చంద్రబాబూ..’ అని జనం అనాలిగానీ, ‘నేను మీ గుండెల్లో వున్నాను..’ అని చంద్రబాబు చెప్పడమేంటో.! ‘విజయదశమి రోజున పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని చెప్పాను. కానీ, నన్ను అక్రమంగా నిర్బంధించారు’ అని పేర్కొన్నారు లేఖలో చంద్రబాబు.
విలువలు, విశ్వసనీయత.. అంటూ ఏవేవో ప్రస్తావించారు ఆ లేఖ ద్వారా టీడీపీ అధినేత. త్వరలోనే ప్రజల ముందుకు వస్తాననీ, అప్పుడు మేనిఫెస్టో విడుదల చేస్తాననీ, తాను చేసిన అభివృద్ధి ప్రజలకు ఎప్పుడూ కనిపిస్తూనే వుంటుందనీ చంద్రబాబు పేర్కొన్నారు.
జనమే నా బలం.. జనమే నా ధైర్యం.. అంటూ ప్రస్తావించిన చంద్రబాబు, దేశ విదేశాల్లో తన కోసం రోడ్డెక్కినవారికి కృతజ్ఞతలూ తెలిపారు. చెడు గెలిచినా నిలవదనీ, మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా కాలపరీక్షలో గెలిచి తీరుతుందనీ చంద్రబాబు చెప్పుకొచ్చారు. విజయదశమి శుభాకాంక్షలూ చెప్పారు చంద్రబాబు.
వారెవ్వా.. ఓ రాజకీయ నాయకుడు జైలు నుంచి ప్రజల్ని ఉద్దేశించి లేఖ రాయడం ఒకింత ఆసక్తికరమే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయ్.! ప్చ్, టీడీపీ అధినేత చంద్రబాబేమో జైల్లో వున్నారు.