పొత్తు మైకంలో బాబు మిస్సవుతున్న లాజిక్ ఇదే!

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు మరోసారి ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా… ఫ్రస్ట్రేషన్ వల్ల గమనించలేదో.. లేక, ఆందోళనలో భాగంగా ఆదమరిచారో తెలియదు కానీ… పొత్తుల మైకంలో పడి జగన్ విషయంలో ఒక లాజిక్ మిస్సాయరనే అంశం తెరపైకి వచ్చింది.

ఏపీలో ఎన్నికలకు ఇంకా పదినెలకు పైగా సమయం ఉందని అధికారపార్టీ చెబుతున్న సమయంలో పొత్తు రాజకీయం ఆరంభమైంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ఖరారవ్వగా… బీజేపీని కలిసి రావాలంటూ ఈ రెండు పార్టీలు ఆహ్వనిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ పర్యటనలోనూ టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముందు ఇదే ప్రతిపాదన చేశారని అంటున్నారు. 2014 ఎన్నికల తరహాలో కలిసికట్టుగా పోటీ చేసి.. సీఎం జగన్ ను ఓడిద్దామని చంద్రబాబు, పవన్ ప్రతిపాదిస్తున్నారు!

జగన్ తన పార్టీ ఆవిర్భావం తరువాత 2014లో తొలిసారి సార్వత్రిక ఎన్నికల సమరంలోకి దిగారు. ఆ సమయంలో ప్రధాని అభ్యర్ధిగా మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు… వారికి మద్దతుగా పవన్ రంగంలోకి దిగారు. పొత్తులతో పోటీ చేసారు. అయితే ఈ ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసిన వైసీపీ 1.95 శాతం ఓట్ల తేడాతో ప్రతిపక్షానికి పరిమితం అయింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది.

అనంతరం 2019 ఎన్నికల్లోనూ తిరిగి వైసీపీ ఒంటరిగానే పోటీ చేసింది. జగన్ తన పాదయాత్ర.. నవరత్నాల మేనిఫెస్టోతో ఏకంగా 151 సీట్లు సాధించి, తిరుగులేని విజయాన్ని నమోదు చేసి సీఎం అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు విడివిడిగా పోటీ చేసాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయడంపై కూడా వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు, ఫలితంగా చంద్రబాబుకు మేలు చేసేందుకే పవన్ సొంతంగా పోటీచేశారని వైసీపీ నేతలు ఆరోపించారు!

ఇప్పుడు మరోసారి ఎన్నికల సంగ్రామానికి పార్టీలు సిద్దం అవుతున్నాయి. మరోవైపు టీడీపీ, బీజేపీతో పొత్తుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీని ఓడించటమే తన లక్ష్యమని జనసేనాని పవన్ ప్రకటించారు. చంద్రబాబుతో జత కట్టారు. బీజేపీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో… తాము అందరం కలిస్తేనే జగన్ ను ఓడించగలమనే సంకేతాలు పరోక్షంగా ఇస్తున్నారు.

అవును.. పొత్తుల మైకంలో చంద్రబాబు ఈ లాజిక్కే మిస్సవుతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే తాను ఒంటరిగా పోటీ చేస్తే వీరమరణమే అని పవన్ పబ్లిక్ గా ఒప్పేసుకున్నారు. అయితే చంద్రబాబుపైకి చెప్పలేకపోతున్నా… లోలోపల ఉన్న ఆందోళన ఇదే అనే విషయం పొత్తుల వెంపర్లాటలో బయటపడిపోతుందనే కామెంట్లు మొదలైపోయాయి.

ఈ సమయంలో… ఎవరు ఎవరితో కలిసినా తాను సింగిల్ గానే పోటీ చేస్తానని జగన్ పదే పదే చెబుతున్నారు. కానీ.. టీడీపీ, జనసేన మాత్రం తాము జగన్ ను ఓడించాలంటే పొత్తులతోనే సాధ్యమవుతుందని చెప్పటం ద్వారా జగన్ బలాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నట్లయ్యిందని అంటున్నారు పరిశీలకులు. జగన్ పని అయిపోయింది అని ప్రతీ సభలోనూ చెబుతున్న చంద్రబాబు… తాను చెబుతున్న ఆ మాట వాస్తవమైతే… అసలు పవన్ తో పొత్తు అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు.

మరి జగన్ బలాన్ని అంగీకరిస్తున్న చంద్రబాబు – పవన్ లు… జగన్ పని అయిపోయిందని, అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత మొదలైపోయిందని కామెంట్లు ఎలా చేస్తున్నారో వారికే తెలియాలి అనేది కొత్త కామెంట్!