చంద్రబాబు మార్కు ‘బ్లండర్’.! సహాయ నిరాకరణేంటి.?

సహాయ నిరాకరణ.. అనేది ఓ ఉద్యమం లాంటిదట. పోలీసులకు చంద్రబాబు ఇకపై సహకరించరట. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా సహకరించవద్దట. అలాగని చంద్రబాబు నిన్న తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ నాయకులు ఇంట్లో అడుగు తీసి అడుగు బయటపెట్టాలంటే సెక్యూరిటీ అవసరం. ఆ సెక్యూరిటీని ఇచ్చేది పోలీసులే. కేంద్ర బలగాల్ని తెప్పించుకున్నాసరే, రాష్ట్ర పోలీసుల సహకారం లేకుండా.. చంద్రబాబు కావొచ్చు, మరో రాజకీయ నాయకుడు కావొచ్చ ఇంట్లో కాలు తీసి బయట పెట్టే పరిస్థితి వుండదు.

సరే, పోలీసు వ్యవస్థకి రాజకీయ రంగు.. అనేది కొత్త విషయం కాదు. చంద్రబాబు హయాంలో పచ్చ పోలీసులు, ఇప్పుడు బులుగు పోలీసులు.. అనే విమర్శల వ్యవహారం వేరే సంగతి. ఎవరు అధికారంలో వున్నా చేసేది అదే. వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతున్నాయన్నది నిర్వివాదాంశం. లేకపోతే, చంద్రబాబుని నిలువరించే క్రమంలో పోలీసులు రోడ్డు మీద భైటాయించడమేంటి.? ఈ పరిస్థితికి కారణమెవరు.? పోలీసులు అలా చేశారని, చంద్రబాబు ‘సహాయ నిరాకరణ’ ప్రకటిస్తే.. నష్టం టీడీపీకే.!

ఔను, టీడీపీ నాయకులెవరూ రోడ్ల మీద తిరగలేరు.. పోలీసులు గనుక సహాయ నిరాకరణని ప్రకటిస్తే. కానీ, పోలీసులు అలా చేయలేరు, చేయరు కూడా. ఒక్క మాటతో చంద్రబాబు, రాజకీయంగా పెద్ద సమాధి తవ్వేసుకున్నట్లయ్యిందన్నది పోలీసు వర్గాల్లో జరుగుతున్న చర్చ. కానీ, బయటకు ఎవరూ ఆ మాట పోలీసు శాఖ నుంచి చెప్పరుగా.?