చంద్రబాబు శ్వేతపత్రం… ధ‌ర్మాన, పెద్దిరెడ్డి ఎక్కడ?

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సూపర్ సిక్స్ హామీల అమలుకంటే ఎక్కువగా చంద్రబాబు.. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని, రాష్ట్రంలోని సంపదంతా దోపిడీకి గురయ్యిందని చెప్పే ప్రయత్నాల్లోనే ఎక్కువ బిజీగా ఉన్నట్లు కనిపిస్తుందని అంటున్నారు.

అయితే చంద్రబాబు వరుసపెట్టి విడుదల చేస్తున్న ఈ శ్వేత పత్రాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కారణం… చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలకు వైసీపీ నుంచి సరైన, కాదు కాదు.. గతంలో బాధ్యులైన మాజీ మంత్రులు స్పందించకపోవడమే. ఇది ప్రజల్లో వన్ సైడ్ సంకేతాలు పంపుతుందని అంటున్నారు. మరి వైసీపీ మాజీ మంత్రులు ఏమయ్యారో?

వివరాళ్లోకి వెళ్తే… ఏపీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ‌రుస‌గా శ్వేత ప‌త్రాలు విడుద‌ల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ శ్వేతపత్రాల విడుదల సమయంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషనిస్తున్నారు.. ఇందులో.. వైసీపీ హ‌యాంలో అంతా దోపిడీ అని చెబుతున్నారు. ప్రజల్లోకి వీలైనంత లోతుగా వెళ్లేలా వివరిస్తున్నారు.

ఈ క్రమంలో చంద్రబాబు ఇప్పటికి నాలుగు శ్వేత ప‌త్రాల్ని విడుద‌ల చేశారు. తాజాగా స‌హ‌జ‌వ‌న‌రుల దోపిడీ పేరుతో చంద్రబాబు విడుద‌ల చేసిన శ్వేత‌ప‌త్రంలో ఆయ‌న సంచ‌ల‌న విష‌యాలు ప్రస్తావించారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో సుమారు 1.75 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని అన్నారు. వీటి విలువ రూ.35 వేల కోట్లని స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో… ఇసుక, మైనింగ్ కూడా విప‌రీతంగా దోపిడీ చేశారని.. వీటి విలువ సుమారు రూ.20 వేల కోట్లు అని ఆయ‌న ఆరోపించారు. అంటే సహజ వనరుల దోపిడీ విలువ సుమారు రూ.55 వేల కోట్లు అన్నమాట. ఈ స్థాయిలో చంద్రబాబు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌గా, వాటికి వైసీపీ నుంచి ధీటైన సమాదానం రాకపోవడం గమనార్హం.

చంద్రబాబు ఈ రేంజ్ లో తీవ్ర విమర్శలు గుప్పించిన అనంతరం… మాజీ మంత్రి మేరుగ నాగార్జున మీడియా ముందుకు వచ్చారు.. చంద్రబాబుకు సవాల్ విసిరారు! అంతవారకూ ఓకే కానీ… అసలు బాబు విమర్శలు గుప్పించిన, తీవ్ర ఆరోపణలు చేసిన శాఖలకు సంబంధించిన మంత్రులు ఏమయ్యరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఈ శ్వేతపత్రంపై చంద్రబాబుకు ధీటైన కౌంట‌ర్ ఇవ్వాల్సింది జ‌గ‌న్ కేబినెట్‌ లో ప‌ని చేసిన రెవెన్యూ, మైనింగ్ శాఖ‌ల మంత్రులు అనేది తెలియంది కాదు. ఎప్పుడైతే వారు రియాక్ట్ అయ్యారో.. దాని ఇంపాక్ట్ ప్రజల్లో వేరేలా ఉంటుంది. చంద్రబాబు చెప్పేవన్నీ సత్యదూరాలు అని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇలాంటి తప్పుడు పురాణాలు చెబుతున్నారని చెప్పాలి!

కుదిరితే… చంద్రబాబు మాదిరిగా వైసీపీ మాజీ మంత్రులు ధ‌ర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కూడా మీడియాను పిలిచి ప‌వ‌ర్‌ పాయింట్ ప్రజెంటేష‌న్లు ఇవ్వాలి! అయితే అలాటివి ఏవీ వైసీపీ నేతల నుంచి రావడం లేదు. ఇది ఇలానే కొనసాగితే… చంద్రబాబు చెప్పిందే నిజ‌మ‌ని, ఓ వర్గం మీడియాలో రాసింది, చూపించిదే వాస్తవమని ఆ 40శాతం ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంది!

మరి ఇప్పటికైనా ఈ చిన్నపాటి లాజిక్ ని మస్థిష్కంలో నిక్షిప్తం చేసుకుని… వైసీపీ మాజీ మంత్రులు స్పందిస్తారా..? లేక, ఇలానే నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా వ్యవహరిస్తారా అనేది వేచి చూడాలి!