తెలుగుదేశం పార్టీ కంచుకోట కుప్పంలో ఈసారి చంద్రబాబుకు భారీ షాక్ ఇవ్వాలని బలంగా ఫిక్సయ్యింది అధికార వైసీపీ. ఇందులో భాగంగా… పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలోకి దింపింది. దీంతో… కుప్పంపై పూర్తి కాన్సంట్రేషన్ పెట్టారు పెద్దిరెడ్డి. ఇదే సమయంలో గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో వైసీపీ ప్రభుత్వం.. కుప్పం అభివృద్ధికి పెద్ద పీట వేసిందని చెబుతున్నారు. ఇంతకాలం కుప్పంలో చంద్రబాబు చేయలేని ఎన్నో అభివృద్ధి పనులకు ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిందనేది ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట.
ఇదే క్రమంలో… గతంలో ఎన్నడూ లేనివిధంగా గడిచిన ఏడాదిన్నరలో ప్రతీ మూడు నెలకొకసారి అన్నట్లుగా చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈసారి తనకు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తే కుప్పాన్ని అభివృద్ధి చేసి, ఈ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని చెబుతున్నారు. మరి ఇప్పటికే 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏమి చేసినట్లు అని ప్రశ్నలు వైరల్ గా మారుస్తున్నారు వైసీపీ నేతలు! దీంతో.. టీడీపీ నేతల నుంచి కౌంటర్లు రావడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి కుప్పంలో గత కొంతకాలంగా చంద్రబాబు గ్రాఫ్ తగ్గుతూ వస్తుందనే విషయాన్ని సాధించిన మెజారిటీ చెప్పకనే చెబుతుందనేది విశ్లేషకుల మాటగా ఉంది. ఇందులో భాగంగా… 1999లో 65వేల పైచిలుకు మెజార్టీ సాధించిన చంద్రబాబు.. 2004లో 59 వేలు, 2009లో 46వేలు, 2014లో 47వేలు, 2019లో 30 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ మాత్రమే సాధించారు. అంటే… ఇది రోజు రోజుకీ తగ్గుతుందనే సంకేతాలు ఇస్తుందనేది వారి అభిప్రాయంగా ఉంది!
వాస్తవానికి కుప్పం, గుడుపల్లి, రామకుప్పం, శాంతిపురం మండలాలు కుప్పం నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. సుమారు రెండు లక్షల 20 వేల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో… వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉంది. ఇక ఇక్కడ సామాజిక సమీకరణాల విషయానికొస్తే… ఇక్కడ బీసీల్లోని వన్నెకుల క్షత్రియ సామాజికవర్గం ఓటింగ్ ఎక్కువ. ఉన్న ఓటర్లలో సుమారు 65 వేల నుంచి 70 వేలు ఓట్లు ఈ సామాజికవర్గానివే ఉన్నాయి.
గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కుప్పంలో చంద్రబాబుకు గట్టిపోటీ ఇచ్చేవారు. సుబ్రహ్మణ్యం రెడ్డి అనే కాంగ్రెస్ నేత 15 ఏళ్లపాటు చంద్రబాబును ఢీకొట్టారు. 2014లో వైసీపీకి సీన్ లోకి రావడంతో… చంద్రబాబుకు ప్రత్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి బరిలోకి దిగారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రమౌళికి అపజయమే ఎదురైనప్పటికీ… వన్నెకుల సామాజిక వర్గానికి చెందిన ఆయన చంద్రబాబు మెజార్టీని తగ్గించడంలో సక్సెస్ అయ్యారు.
ఇందులో భాగంగా… 2014లో చంద్రబాబుకు ప్రత్యర్థిగా పోటీ చేసిన చంద్రమౌళి.. 55 వేల ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో సుమారు 70 వేల వరకూ కొల్లగొట్టారు. గత 35 ఏళ్లలో చంద్రబాబుకు ప్రత్యర్థులుగా పోటీ చేసిన ఏ ఒక్కరికి 50 వేల ఓట్లు రాలేదు. అయితే… గత ఎన్నికల తర్వాత అనారోగ్యంతో చంద్రమౌళి మరణించడంతో ఇప్పుడు ఆయన కుమారుడు భరత్ ను వైసీపీ రంగంలోకి దింపింది. కుప్పం ఇన్‌చార్జి బాధ్యతలతోపాటు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి నైతిక మద్దతు అందిస్తోంది.
ఇదే సమయంలో… రానున్న ఎన్నికల్లో కుప్పంలో భరత్ ను గెలిపిస్తే.. తన క్యాబినెట్ లో తొలి మంత్రి అతడే అన్నట్లుగా జగన్ ప్రకటించారు. దీంతో… ఈసారి కుప్పంలో బాబుకు అంత ఈజీ కాదనే కామెంట్లు వినిపించడం మొదలయ్యింది. పైగా… వన్నెకుల క్షత్రియ సామాజికవర్గంతో పాటు మిగిలిన ఎస్సీ, బీసీ సామాజీక్వర్గాలనూ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు ఈసారి లక్ష మెజారిటీని టార్గెట్ గా పెట్టుకున్నారు చంద్రబాబు!
మరి రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కోరిక మేరకు కుప్పం ప్రజలు లక్ష ఓట్ల మెజారిటీ అప్పగిస్తారా.. లేక, భరత్ ను అవకాశం ఇచ్చి బాబుకు షాకిస్తారా అనేది వేచి చూడాలి.