కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని రాష్ట్రాల ఆదాయం తగ్గింది. పాలనకు, ఖర్చులకు అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ప్రతి రాష్ట్రం మామూలుగా తీసుకోవాల్సిన పరిమితికి మించి అప్పులు కావాలంటోంది. వాటిలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. ఖజానా మొత్తాన్ని సంక్షేమ పథకాలను వినియోగించడంతో నిర్వాహణకు అప్పులే దిక్కయ్యాయి. ఎఫ్‌ఆర్బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర జీడీపీలో రాష్ట్రం తెచ్చే అప్పులు 3 శాతానికి మించరాదు. మించితే కేంద్రం నుండి అందే ఆర్థిక సాయంలో కోత పడుతుంది. ఆర్థిక పరిస్థితులు దెబ్బ తినడంతో ఎఫ్ఆర్బీఎం పరిమితిని 5 శాతానికి పెంచాలని అన్ని రాష్ట్రాలు కోరగా కేంద్రం ఒప్పుకుని నాలుగు షరతులు పెట్టి ఒక్కో షరతును అమలుచేస్తే 0.25 శాతం పెరుగుతుందని తెలిపింది.
ఆ షరతుల్లో వన్ నేషన్.. వన్ రేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సంస్కరణలు, పురపాలక సంస్కరణలు, వ్యవసాయ పంపుసెట్లకు నగదు బదిలీ ఉన్నాయి. వీటిలో ఒకే దేశం.. ఒకే రేషన్ విధానాన్ని గతంలోనే చంద్రబాబు అమలుచేశారని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా అంటోంది. ఆధార్, వేలి ముద్రల అనుసంధాన ప్రక్రియ ద్వారా దీన్ని అమలుచేసి దేశంలో ఎక్కడైనా రేషన్ పొందే వెసులుబాటు కల్పిస్తారు. దీన్ని వేలి ముద్రల ద్వారా రేషన్ పొందే సౌకర్యం కల్పించి బాబుగారు 2015లోనే అమలుచేశారని చెబుతున్నారు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రాన్ని బాబు అగ్రస్థానంలో నిలిపారని అంటున్నారు.
రెండు రోజుల క్రితం కేంద్రం పారిశ్రామిక అనుకూల సంస్కరణలతో సులభతర వ్యాపారానికి అవకాశం ఇస్తున్న రాష్ట్రాల్లో ఏపీకి మొదటి స్థానం ఇచ్చింది. గతంలో వరుసగా రెండుసార్లు ఏపీ తొలి స్థానంలో నిలిచింది. ఇది బాబుగారి ఘనతేనని, ఆయన విజన్ కలిగిన నాయకుడు కాబట్టే ఈరోజు వైఎస్ జగన్ కు పెద్దగా శ్రమ లేకుండా అప్పుల పరిమితిని పెంచుకునే అవకాశం కలిగిందని, ఇది చంద్రబాబు సమర్థతకు నిలువెత్తు సాక్ష్యమని అంటున్నారు.
బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి వెనుక బాహుబలి నిలువెత్తున సాక్షాత్కరించే సన్నివేశాన్ని గుర్తుచేస్తూ బాబే లేకపోతే ఈరోజు ఆర్థిక వ్యవస్థ కష్ట కాలంలో ఉండగా రాష్ట్రానికి అప్పు పుట్టేదా, అప్పుల మీదే నడుస్తున్న వైఎస్ జగన్ పాలనకు మార్గం సుగమం అయ్యేదా అంటున్నారు. మరి టీడీపీ, వారి అనుకూల మీడియా చేస్తున్న ఈ వాదనకు వైసీపీ లీడర్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.