భయాందోళనలు కలిగిస్తోన్న బాబు విజన్… తెరపైకి నాటి దారుణాలు!

జనాలకు గతం గుర్తులేదనుకున్నారో.. లేక, ఆయనకు గుర్తులేదో తెలియదు కానీ… తాజాగా విజన్ 2047 అని కొత్త మోత ఎత్తుకున్నారు చంద్రబాబు. దేశానికి స్వాతంత్రం వచ్చి నాటికి వంద సంవత్సరాలు పూర్తవబోతోన్న సందర్భంగా… దేశాన్ని ఎక్కడో పెట్టడానికి ఈ విజన్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీంతో గతం గుర్తుచేస్తున్నారు పరిశీలకులు.

అవును… విజన్ – 2020 పేరు చెప్పి చంద్రబాబు తన పాలనలో చేసిన దారుణాలు అన్నీ ఇన్నీ కాదు. సామాన్య ప్రజానికాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులూ పెట్టిన పాలన చంద్రబాబు సొంతం! అసలు విజన్ – 2020 అంటూ నాడు చంద్రబాబు చేసిందేమిటి? ఫలితంగా.. ప్రజలకు, సమాజానికి ఒరిగిందేమిటి? ఇప్పుడు చూద్దాం!

చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో సుమారు 54 పరిశ్రమలను అమ్మేశారు. ఫలానా ఫ్యాక్టరీ వల్ల రాష్ట్రానికి ఆర్ధిక భారం మినహా మరో ప్రయోజనం లేదని అనుకూల పత్రికల్లో అచ్చేయించడం.. అనంతరం వాటిని అమ్మేయడం.. ఇదంతా బాబు ముందుచూపని చెప్పించడం జరిగేవి!

ఇదే ఫార్ములాతో నాటి ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 54 సంస్ధలను అమ్మేశారు చంద్రబాబు! అది కూడా తన అనుచరులు, తన బినామీలకు పావలాకు అర్ధరూపాయికి ఎన్నో సంస్థలు అమ్మేశారని అప్పట్లో తెగ విమర్శలు వచ్చాయి! అయినప్పటికీ ఈ విజనరీ ఏమాత్రం పట్టించుకోలేదని చెబుతుంటారు!

కంటికి కనిపించని ఈ ఘోరంతోపాటు కంటికి ఎర్రగా కనిపించి రక్తపాతం సృష్టించిన ఒక ఘోరం కూడా బాబు విజన్ – 2020 చలవే! కేవలం ప్రపంచ బ్యాంకు సూచనల మీద పాలన చేసి, ప్రజలను గాలికి వదిలేశారనే పేరు సంపాదించుకున్న చంద్రబాబు.. విద్యుత్ చార్జీలు భారీగా పెంచారు.

దీంతో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది.. ఆందోళన చేశారు.. అది కాస్తా కాల్పులకు దారితీయడంతో ముగ్గురు చనిపోయారు. అవును… విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరిన సామాన్యులపై చంద్రబాబు సర్కార్ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. అత్యంత దారుణమైన సంఘటనగా ఇప్పటికీ చరిత్ర పుటల్లో నిలిచింది. బషీర్ భాగ్ అంటే… చంద్రబాబు ప్రభుత్వం జరిపిన కాల్పులే గుర్తుకువస్తాయన్నా అతిశయోక్తి కాదేమో!

రాష్ట్రంలో తన పాలనలోనే తొలిసారిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విధానం తీసుకొచ్చారు చంద్రబాబు. తన హయాంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను నిర్వీర్యం చేసేసి అన్ని శాఖల్లోనూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విధానం అమలు చేశారు. అంటే ఒక రెగ్యులర్ ఉద్యోగి చేసే పనులు ఈ అవుట్ సోర్సింగ్ కుర్రాడితో చేయించి కాసిన చిల్లరను జీతంగా ఇచ్చేవారన్నమాట.

ఇదే క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల నుంచి ఫీజు వసూలు చేసే యూజర్ చార్జీల విధానం తెచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఈ యూజర్ చార్జీలు వసూలు చేసేవారు. ఓపీ సీటుతో పాటు ప్రతీ టెస్ట్ కూ ఛార్జీలు వసూల్ చేసేవారు. ఇది కూడా బాబు విజన్ 2020 లో ఒక భాగం కావడం గమనార్హం!

ఇక విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదని గర్వంగా చెప్పుకునే చంద్రబాబు విధానాలవల్ల ప్రభుత్వ విద్యావ్యవస్థ నాశనం అయిందనేది మరో బలమైన విమర్శ ఉంది. ఆయన హయాంలోనే ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు తగ్గడంతో కార్పొరేట్ స్కూళ్ళు వీధివీధినా వెలిశాయి. దీంతో… మధ్యతరగతివాళ్ళు సైతం అప్పు చేసి అయినా సరే కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలకు తమ బిడ్డలను పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ స్థాయిలో సాగిన చంద్రబాబు అరాచకపాలనపై అప్పట్లో పొత్తులో ఉండే కమ్యూనిష్టు నాయకులు సైతం విసిగిపోయారో ఏమో కానీ… “బాబు జమానా అవినీతి ఖజానా” అంటూ పెద్ద పుస్తకమే రాశారు! ఇందులో బాబు పాలన ఎంత డొల్ల అనేదాన్ని స్పష్టంగా వివరించిన సంగతి తెలిసిందే!

ఇలాంటి అరాచక భావాలు, అబద్ధాలు, వ్యవస్థలను ధ్వంసం చేసే ఆలోచనలతో చంద్రబాబు పాలన సాగిందని అంటారు. ఈయన తీరును చూసిన స్విట్జర్లాండ్ ఆర్ధికమంత్రి పాస్కల్ ఓ సదస్సులో మాట్లాడుతూ.. “ఇలాంటి అబద్ధాలకోరులను మా దేశంలో ఐతే జైల్లో కానీ, పిచ్చాసుపత్రిలో కానీ పెట్టేవాళ్ళం” అని అన్నారంటే… తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు!

గతంలో ఇంత దారుణమైన పాలన అందించిన చంద్రబాబు… మరోసారి విజన్ 2047 అంటూ కొత్త పల్లవి అందుకున్నారు! దీంతో బాబును నమ్మేవారెవరు.. నమ్మితే నరకమే అనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం!