పవన్ అండగా రంగంలోకి చంద్రబాబు… ట్వీట్ వెనకున్న ట్విస్ట్ ఇదే!

వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో… ఏపీ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ పై కేసులు నమోదవ్వగా.. మహిళా కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది.. అయినా కూడా పవన్ తగ్గట్లేదు.

ఇందులో భాగంగా తాజాగా ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం మంగళగిరిలో కార్యకర్తల సమావేశంలో మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కోసారి సన్నాయినొక్కులు నొక్కుతూనే.. మరో క్షణంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

పవన్ వాలంటీర్ల వ్యవస్థ మీద ఆధారాలు లేని ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వం ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇక కోర్టుకు కూడా వెళ్ళి మరీ పవన్ మీద పరువు నష్టం దావా కేసులో ఇరికించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందించారు.

అవును… పవన్ విషయంలో పరువు నష్టం కేసు పెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం అనుమతించడాన్ని చంద్రబాబు ఆన్ లైన్ వేదికగా తప్పు పట్టారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ఎక్కడికి పోతోంది అని ఆయన ప్రశ్నించారు. ఇలా డేటా చేరీ చేస్తున్న ప్రభుత్వం మీదనే కేసు పెట్టాలని బాబు ట్వీట్ చేయడం విశేషం.

“తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.” అంటూ పవన్ కల్యాణ్ కి మద్దతుగా ట్వీట్ వేశారు చంద్రబాబు. పవన్ పై కేసు పెట్టడం, బుద్దిలేని, నీతిమాలిన చర్యగా అభివర్ణించారాయన. ఈ సందర్భంగా… ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలని హితవు పలకడం గమనార్హం.

మరోవైపు వాలంటీర్ల మీద పవన్ చేస్తోన్న వివాదాస్పద ఆరోపణల వెనుక చంద్రబాబు ఉన్నారని.. ఈ వ్యవహారంలో తెరవెనుక ఆయనదే కీలక పాత్ర అని జగన్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో స్క్రిప్ట్ రామోజీది అయితే… నిర్మాత చంద్రబాబు అని అన్నారు. ఇక మాటలు, నటన పవన్ ది అని జగన్ విమర్శించారు.

ఆ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా తాజాగా చంద్రబాబు స్పందించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… గురువారం సాయంత్రమే పవన్ కల్యాణ్ కేసు వ్యవహారం బయటకొచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులు కూడా అప్పుడే విడుదలయ్యాయి. కానీ చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం తర్వాత ట్వీట్ చేశారు.

వెంకటగిరి సభలో సీఎం జగన్.. చంద్రబాబు, పవన్, లోకేష్, బాలయ్య.. ఇలా అందర్నీ ఒకేగాటన కట్టి దుమ్ముదులిపేశారు. వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని చెబుతూ… ఒక్కొక్కరి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అయిన కాసేపటికే చంద్రబాబు, పవన్ కి మద్దతుగా ట్వీట్ వేయడం విశేషం.