మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్ట్ చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్లు పంపడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ అంశం దుమారం రేపుతోంది. దీనిపై వాడి వేడి చర్చలు సాగుతున్నాయి. ఇక టీడీపీ నాయకులంతా బీజేపీ కుట్రగా దీనిని అభివర్ణించారు. తెలంగాణ కోసమే తమ అధినేత చంద్రబాబు నాయుడు, మరి కొందరు నాయకులతో కలిసి నిరసన తెలపటానికి వెళ్లామని చెబుతున్నారు టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రాలోనూ ప్రజల సానుభూతిని కూడా దక్కించుకున్నారు.
అయితే టీడీపీ చేస్తున్న ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆయన వాయిదాలకు హాజరు కాకపోవటంతో కోర్టు నోటీసులు పంపింది. దీనితో బీజేపీకి ఎలాంటి సంబంధం ఉంటుంది అని ప్రశ్నిస్తున్నారు. దొంగ సింపతీ కోసం చంద్రబాబు ట్రై చేస్తున్నాడని బీజేపీ నేతలు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. వైసీపీ కూడా బాబ్లీ కేసును చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం వాడుకుంటున్నాడని పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా చంద్రబాబు కొత్త డైలమాలో పడ్డారు. ఆయన పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందాన ఉంది. అసలు విషయం ఏమిటంటే చంద్రబాబు సెప్టెంబరు 21 లోపు కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర వెళ్లాలంటే చంద్రబాబు తెలంగాణ నుండే వెళ్ళాలి. దీన్ని అవకాశంగా మలుచుకోవాలి అని సూచిస్తున్నారు టీడీపీ నేతలు.
60 నుండి 70 వాహనాల్లో పెద్ద పరేడ్ గా మహారాష్ట్ర వెళ్ళాలి అంటున్నారట. తెలంగాణ ప్రజల కోసమే పోరాటం చేశామని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేసుకుంటూ మహారాష్ట్ర కోర్టుకు వెళ్లాలని తమ అధినేతకు సూచిస్తున్నారట. కానీ చంద్రబాబు మాత్రం ఈ విషయంలో సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ఈ సందిగ్ధం ఎందుకయ్యా అంటే…కోర్టుకు హాజరైతే బాబు మరో ప్రెస్టీజియస్ అవకాశాన్ని వదులుకోవాలి.
ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ లో జరగనున్న జనరల్ అసెంబ్లీ సమావేశానికి ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడుకి ఆహ్వానం పంపింది. దేశంలో ప్రధానికి కూడా ఆహ్వానం రాకుండా ఒక ముఖ్యమంత్రిని ఆహ్వానించడం అరుదైన గౌరవం. సెప్టెంబర్ 24 సాయంత్రం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో “ఫైనాన్సింగ్ సస్టెయినబుల్ అగ్రికల్చర్: గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ” కార్యక్రమం జరగనుంది. దీనిపై చంద్రబాబు ప్రసంగించవల్సిందిగా కోరుతూ లేఖను పంపారు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హైమ్. ఈ సందర్భంగా ” ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీరో బడ్జెట్ సహజ వ్యవసాయ కార్యక్రమం ద్వారా పర్యావరణ, సాంఘిక, ఆర్ధిక పరివర్తన తీసుకొచ్చిందంటూ కొనియాడారు”.
అయితే చంద్రబాబు నాయుడుకి ఎప్పటినుండో అంతర్జాతీయంగా గుర్తింపు పొందాలనే ఆశ ఉంది అని రాజకీయ శ్రేణుల నుండి వినిపించే మాట. అటువంటిది ఐక్యరాజ్యసమితి నుండి ప్రధానికి కూడా అందని ఆహ్వానం అందింది అంటే అది అరుదుగా దక్కే అవకాశం. దీనిని వదులుకోవడానికి చంద్రబాబుకి మనసు ఒప్పట్లేదు. ఇలాంటి అవకాశాలు ఎప్పుడంటే అప్పుడు రావు. మరి ఇది వదులుకోవడం అంటే ఆయన అతి పెద్ద కోరికని వదులుకోవడమే…
కానీ పార్టీశ్రేణుల నుండి తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీటీడీపీ బలం పుంజుకోవాలన్న, ఇటు ఆంధ్రా ఎన్నికల్లో నెగ్గాలన్నా బాబ్లీ కేసులో కోర్టుకు హాజరయ్యి మేము న్యాయస్థానానికి గౌరవం ఇస్తున్నాం అని నిరూపించుకోవాలి. కోర్టుకి హాజరైనా మహా అయితే ఒక రోజు కస్టడీలో ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎలాగో బెయిల్ తీసుకుని బయటకు వచ్చేస్తారు. కానీ ఈ ప్రాసెస్ రెండు మూడు రోజులు పట్టొచ్చు. సెప్టెంబర్ 21 నుండి 24 కి మధ్యలో మూడు రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. సో ఆయన న్యూయార్క్ వెళ్లి ప్రసంగం ఇచ్చే అవకాశం కోల్పోతారు.
ఆయన మనసులోనేమో గ్లోబల్ ఇంపార్టెన్స్ కావాలనే ఆశ బలంగా ఉంది, పార్టీ శ్రేణులేమో లోకల్ గా బలం పుంజుకోవాలని ఒత్తిడి తెస్తున్నారట. ఆయన ర్యాలీగా ధర్మాబాద్ కోర్టు వెళితే బోలెడంత ప్రచారం దక్కుతుంది. మీడియా ఇదంతా ప్రసారం చేస్తుంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండానే ఆయనకు లాభం చేకూరుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలోని కోర్టుకి హాజరయ్యాడు అంటే నేషనల్ మీడియా కూడా కవరేజ్ ఇస్తుంది. దీంతో ఆయన పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది. ఇది పార్టీకి బలాన్ని చేకూరుస్తుంది.
ఐక్య రాజ్యసమితి మీటింగ్ లో పాల్గొంటే ఆయనకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆయన కోరిక నెరవేరినట్టు అవుతుంది. పైపెచ్చు ప్రధానికి కూడా దక్కని ఆహ్వానం ఆయనకు దక్కిందంటే దేశంలో కూడా ఆయన కొన్ని మెట్లు పైకి ఎక్కినట్టే. ఇప్పటికే టీడీపీ నేతలంతా ఎప్పుడూ మా అధినేత ప్రధాని కావాల్సినవాడు అంటూ చెబుతూ ఉంటారు. ఇక అక్కడ ప్రసంగం ఇస్తే గ్లోబల్ గా ఆయనకు ఇంపార్టెన్స్ పెరుగుతుంది.
ఇప్పుడు ఆయన ముందు రెండు బెస్ట్ అషన్స్ ఉన్నాయి. ఒకటి చూజ్ చేసుకుంటే మరొక గొప్ప అవకాశాన్ని కోల్పోతారు బాబు. ఒకవైపు తెలుగు తమ్ముళ్ల ఒత్తిడి, మరొకవైపు గ్లోబల్ ఇంపార్టెన్స్. రెండిట్లో ఏది ఎన్నుకోవాలో తెలియక చంద్రబాబు డైలమాలో పడ్డారు.