చంద్రబాబు మారరుగాక మారరు. ఓటర్లను బెదిరించడమేంటి.? హెచ్చరించడమేంటి.? ఏదో ఒకసారి పొరపాటుగా ఆ ‘హెచ్చరిక’ వస్తే బాగానే వుండొచ్చు. కానీ, పదే పదే ఓటర్లను బెదిరించడం ద్వారా, హెచ్చరించడం ద్వారా టీడీపీ అభ్యర్థుల్లో గుబులు పెంచేస్తున్నారు పార్టీ అధినేత. చంద్రబాబు పర్యటనతో తమ గెలుపు అవకాశాలు పెరుగుతాయని భావించిన టీడీపీ అభ్యర్థులు, చంద్రబాబు పర్యటన దెబ్బకి ప్రజలు తమను ఈసడించుకునే పరిస్థితి వచ్చిదంటూ వాపోతున్నారు. ‘చంద్రబాబు, ఎన్నికల ప్రచారానికి రాకపోయినా బావుంటుందేమో..’ అని గుంటూరు జిల్లాకి చెందిన ఓ సీనియర్ టీడీపీ నేత తన సన్నిహితుల వద్ద వాపోయారట.. చంద్రబాబు తాజా ఎన్నికల ప్రచారం నేపథ్యంలో. ‘కరెంటు తీగను ఒక్కసారే కదా.. అని పట్టుకుంటామా.? పట్టుకుంటే షాక్ కొడుతుంది. వైసీపీకి ఓటెయ్యడం కూడా అంతే. ఇప్పటికే మీరు షాక్ తిన్నారు. ఇంకోసారి వేస్తారా.? వేయ్యొద్దని మళ్ళీ హెచ్చరిస్తున్నాను.
ఈసారి నా మాట పెడచెవిన పెట్టొద్దు..’ అంటూ గుంటూరులో తాజాగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సెలవిచ్చారు. ‘టీడీపీని గెలిపించండి..’ అనే మాటను తక్కువగా వాడుతూ, ‘వైసీపీని ఓడించండి..’ అనే నినాదాన్ని ఎక్కువగా చంద్రబాబు వినిపిస్తున్నారు. ‘కొబ్బరి చిప్పల మంత్రి, బెంజి మంత్రి, బూతుల మంత్రి, పుడింగి మంత్రి..’ అంటూ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చేస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటివన్నీ రాజకీయాల్లో మామూలే కావొచ్చుగానీ, ప్రజల్ని హెచ్చరించడం ఏ రాజకీయ పార్టీకీ తగదు. మునిసిపల్ ఎన్నికల్లో ఇప్పటికే చాలా చోట్ల వైసీపీ ఏకగ్రీవాలు చేసేసుకుంది. మిగిలిన చోట్ల తెలుగుదేశం పార్టీకి అనుకూలతలు తక్కువగానే కనిపిస్తున్నాయి. బహుశా ఆ ఆందోళనే చంద్రబాబు, అసహనంతో ఊగిపోవడానికి కారణమని అనుకోవాలేమో.