ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1,26,000కు పైగా గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలను 2,50,000కు పైగా గ్రామ, వార్డ్ వాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు వాలంటీర్లను తొలగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా చంద్రబాబు చేసిన కామెంట్లు వింటే చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్ల ఉద్యోగాలకు గ్యారంటీ లేనట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ జనం తిరగబడితే సీఎం జగన్ ఏపీ వదిలి పారిపోతాడని అన్నారు. వరద బాధితులకు చేసే సహాయం విషయంలో ప్రభుత్వ డొల్లతనం బయటపడిందని చంద్రబాబు కామెంట్లు చేశారు. సీఎం జగన్ అన్ని వ్యవస్థలను నిలువునా ముంచేశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 77 గ్రామాలు వరద నీటిలోనే ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు వెల్లడించారు.
తెలంగాణ సర్కార్ వరద బాధితులకు రూ.10 వేల సాయం అందిస్తే ఇక్కడ మాత్రం బియ్యం ఇచ్చే పరిస్థితి కూడా లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వరద బాధితులకు న్యాయం జరిగే వరకు రాజకీయ పోరాటం చేస్తానని వరద బాధితులకు నాలుగు ఉల్లిపాయలు, నాలుగు బంగాళదుంపలు ఇచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. బాధితులందరికీ రూ.10 వేల రూపాయలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించని పక్షంలో పెన్షన్లు తీసేస్తామని రేషన్ కార్డ్ తొలగిస్తామని వాలంటీర్లు చెబుతున్నారని ఎవ్వరి పెన్షన్లు, రేషన్ కార్డులు పోవని వాలంటీర్ల ఉద్యోగాలే తొలగిస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం వాలంటీర్లుగా పని చేస్తున్న వాళ్లందరికీ ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో చంద్రబాబుకు వ్యతిరేకంగా వాలంటీర్లు పని చేసే ఛాన్స్ అయితే ఉంది.