అసలే అవసాన దశలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అంతర్గత కలహాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడికక్కడ గొడవలను సర్దుబాటు చేసుకుంటూ వెళుతుంటే కొత్త గొడవలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అధికారంలో లేదు కదా ఏం చేస్తాడులే అనే ధైర్యమో ఏమో కానీ అందరూ చంద్రబాబు మీద తిరుగుబాటు చేసేవాళ్ళే. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం ఇప్పటి నుండే బెదిరింపులు, హెచ్చరికలు చేస్తున్నారు. ఈమధ్య కర్నూలు జిల్లా టీడీపీ నేత కేఈ ప్రభాకర్ తాను ఈసారి డోన్ నియోజకవర్గం నుండి పోటీకి దిగుతానని ప్రకటించుకున్నారు. అయితే ఈ ప్రకటనకు చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదట. బాబుగారు కేఈకి మాట ఇచ్చింది కూడ లేదట.
కర్నూలు జిల్లా టీడీపీ రాజకీయాల్లో కేఈ కృష్ణమూర్తి కుటుంబం కీలకమైంది. అయితే కేఈ గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ఆయన సోదరులు ప్రభాకర్, ప్రతాప్ ఇద్దరూ యాక్టివ్ గానే ఉన్నారు. ఉంటే పర్వాలేదు. ఇద్దరి మధ్యనా విబేధాలు రోజురోజుకూ పెరుగుతున్నాయట. కేఈ కృష్ణమూర్తి, ప్రభాకర్ ఇద్దరూ డోన్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించినవారే. అలా కే ఈ ప్రతాప్ సైతం డోన్ అసెంబ్లీలో గెలవాలని అనుకున్నారు. కానీ 2004 నుండి మూడుసార్లు బరిలోకి దిగినా గెలవలేకపోతున్నారు. గత ఎన్నికల్లో ప్రభాకర్ సైతం టికెట్ మీద ఆశలు పెట్టుకోగా ప్రతాప్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది.
దీంతో అసంతృప్తికి గురైన ప్రతాప్ ఎమ్మెల్సీ పదవి చేతిలో ఉన్నా చల్లబడలేదు. ఈసారి ఎలాగైనా డోన్ టికెట్ పొందాలని వైసీపీలోకి వెళ్లాలని అనుకున్నారు. కానీ వైసీపీలోకి వెళ్లినా డోన్ టికెట్ ఆయనకు దొరకడం అసాధ్యం. ఎందుకంటే అక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నారు. ఆయన్ను కాదని ప్రభాకర్ టికెట్ పొందడం అసాధ్యం. అందుకే టీడీపీలో ఉండే తేల్చుకోవాలని భావించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాబోయారు. ఆయన అనుకున్నట్టే బాబుగారు బుజ్జగించి మాన్పించారు. బాబుగారే దిగిరావడంతో స్పీడ్ పెంచాలనే ఉద్దేశ్యంతో ఈసారి డోన్ నుండి నిలబడబోయేది నేనే అంటూ స్వీయ ప్రకటన చేసేసుకున్నారు. దీంతో షాకవ్వడం బాబుగారి వంతైంది. సోదరుడి ప్రకటన విన్న కేఈ ప్రతాప్ సైతం చంద్రబాబు వద్దనే పంచాయతీ పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారట.