గతానుభవం చేదే… ఇప్పుడు నిజం సానుభూతిగా మారితే..?

చంద్రబాబులో విజనరీని చూశారు.. ఉమ్మడి రాష్ట్రంలో అందుకే పట్టం కట్టారు! చంద్రబాబులో అనుభవాన్ని నమ్మారు.. అందుకే విభజిత ఏపీలో గద్దె నెక్కించారు! అభివృద్ధి చేయాలంటే బాబు ఉండాలని తమ్ముళ్లు చెబుతుంటారు.. సంక్షేమం అందాలంటే చంద్రబాబు రావాలని టీడీపీ శ్రేణులు బలంగా చెబుతున్నాయి! ఇవి బాబు బలాలు.. బలగాలు! అయితే ఈసారి బాబు సరికొత్త అస్త్రంతో రంగంలోకి దిగుతున్నారు!

ఏమాటకామాట చెప్పుకోవాలంటే ఏపీలో వైఎస్ జగన్ సంక్షేమంలో నూటికీ 99 మార్కులు తెచ్చుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే… అభివృద్ధి విషయంలో మాత్రం సెకండ్ క్లాస్ మార్కులు మాత్రమే అని పెదవి విరుస్తున్నారు పలువురు! ఈ సమయంలో సంక్షేమం పేరుచెప్పి చంద్రబాబు జనాల్లోకి రావడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఉండదనేది పలువురు చెబుతున్న మాట.

చంద్రబాబు కచ్చితంగా గ్రాఫిక్స్ లా కాకుండా… అధికారంలోకి వస్తే తాను చేయబోయే అభివృద్ధి విషయంలో నమ్మశక్యమైన హామీలు ఇవ్వడం అనేది ఇప్పుడు ఆయన ముందున్న పెద్ద టాస్క్. ఇప్పుడే ఫస్ట్ టైం సీఎం అవ్వడం లేదు కాబట్టి… “పూర్ టు రిచ్” అంటే నమ్మడం కష్టమే! ఆ పూటకు గట్టేక్కించే “పసుపూ – కుంకుమ” వంటి హామీలను ప్రజలు నమ్మడం మానేశారనే విషయం బాబుకు 2019 ఎన్నికల సమయంలోనే అర్ధమైపోయి ఉండాలి!

ఇదే సమయంలో సంక్షేమమే లక్ష్యం అన్నట్లుగా మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టో కూడా టీడీపీకి ఇచ్చిన మైలేజ్ కంటే ఎద్దేవాలే ఎక్కువని అంటున్నారు. కారణం… అందులోని హామీలన్నీ కంట్రోల్ సి, కంట్రోల్ వి అనేది అతిపెద్ద విమర్శ! దీంతో… సొంతంగా ఆలోచించండి అంటూ అధికార పక్షం నుంచి సెటైర్లు పడ్డాయి!

దీంతో సానుభూతి అస్త్రాన్ని మరింత బలంగా ఉపయోగించాలని బాబు బలంగా భావిస్తున్నారని తెలుస్తుంది. తన సతీమణిని నిండు అసెంబ్లీలో వైసీపీ నేతలు అవమానించారు.. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు.. టీడీపీ కార్యకర్తలను సెలక్టివ్ గా చంపారు.. అన్నింటికీ అల్టిమేట్ గా తనను ఈ వయసులో ఏ తప్పూ చేయకపోయినా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ విషయాలను చంద్రబాబు గరిష్టంగా ఉపయోగించుకోబోతున్నారని తెలుస్తుంది.

వాస్తవానికి చంద్రబాబుకు ఇప్పుడు సెంటిమెంట్ వర్కవుట్ అయితే మామూలుగా ఉండదని అంటున్నారు పరిశీలకులు. కారణం… స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బాబు అరెస్ట్ నిజం.. సుమారు 52 రోజులపాటు జైలు జీవితం నిజం.. ఆయనను ఈ వయసులో అరెస్ట్ చేయడంపై అయ్యో అని చాలామంది అనుకున్న మాట కూడా నిజం. కానీ… ఈ నిజాలన్నీ సానుభూతిగా మారుతాయా అన్నదే పెద్ద ప్రశ్న.

కారణం… గతంలో ఈ విషయంలో ఒక చేదు అనుభవం ఉంది! చంద్రబాబుకు సానుభూతి కలిసి రాదని ఆ గతం చెబుతుంది. అవును… చంద్రబాబు మీద 2003లో మావోయిస్టులు అలిపిరి వద్ద బాంబు దాడి చేసిన సంగతి తెలిల్సిందే. ఆ దాడిలో బాబు నిజంగానే చావు అంచుల వరకూ వెళ్లి బయటపడ్డారు. దీంతో… బాబుని ఆ ఏడుకొండల వాడే రక్షించాడని అంతా అనుకున్నారు.

అది 2003 అక్టోబర్ లో జరిగితే 2004 మే లో జరిగిన ఎన్నికలకు బాబు ముందస్తు మంత్రం అందుకున్నారు. కానీ… ఆ సానుభూతి పనిచేయలేదు. అప్పటికే పాదయాత్రతో ఏపీ అంతా తిరిగి ప్రజాసమస్యలు తెలుసుకున్న వైఎస్సార్ ని జనాలు ఎన్నుకున్నారు. ఈ సమయంలో… చంద్రబాబు చేతి కట్టుతోనే కొన్ని నెలలపాటు తిరిగారు. ఆయన ఎన్నికల ప్రచారం పోస్టర్ల మీద కూడా చేతి కట్టుతోనే ఫోటోలు వేశారు. అలాగే బాంబు దాడి దృశ్యాల పోస్టర్లను కూడా వేశారు.

కానీ చంద్రబాబ్బుకు మాత్రం ఆ పరిస్థితుల్లో కూడా సానుభూతి ఏ మాత్రం దక్కలేదు. చివరికి చంద్రబాబుపై బాంబు దాడి జరిగిన తిరుపతి నియోజకవర్గంలో కూడా నాడు కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. ఈ ఒక్క విషయమే టెన్షన్ పెడుతుంది తప్ప… ఈసారి సానుభూతి వర్కవుట్ అయితే మాత్రం చంద్రబాబుకు తిరుగుండదని అంటున్నారు పరిశీలకులు!